OTT Review: ప్రతి అబ్బాయిలోనూ తన లవరే.. ఓటీటీలో ఉత్కంఠగా సైకో థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్

OTT Review: ప్రతి అబ్బాయిలోనూ తన లవరే.. ఓటీటీలో ఉత్కంఠగా సైకో థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్

మలయాళ లేటెస్ట్ సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఫేసెస్’ (Faces). తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ (Sun NXT)లో మే 29 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ, సస్పెన్స్, మానసిక సంఘర్షణల చుట్టూ తిరిగే ఈ మూవీ కథ ఆసక్తికరంగా ఉండటంతో ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. కలేష్ రామానంద్, హన్నా రెజి కోషి తమ నటనలతో ఫిదా చేశారు.

ఒక ప్రమాదం తర్వాత జ్ఞాపకశక్తి కోల్పోయిన యువతి జీవితంలో చోటుచేసుకునే అనూహ్య పరిణామాలే కథకు ప్రధాన ఆకర్షణ. తాను ప్రేమించిన వ్యక్తి ముఖం ఎదురయ్యే ప్రతి అబ్బాయిలోనూ కనిపించడం, అది వాస్తవమా లేక భ్రమా అన్న సందిగ్ధత కథపై మరింత ఉత్కంఠను పెంచుతుంది. దర్శకుడు నీలేష్ ఇ.కె. రూపొందించిన ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను కథతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అలాగే, గోపిసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చాయి.

కథేంటంటే:

నిత్య (హన్నా రెజీ కోషి), మైఖేల్ (కాలేష్ రామానంద్) ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. లివ్‌‌–ఇన్ రిలేషన్‌‌షిప్‌‌లో ఉంటారు. వాళ్ల జీవితం హ్యాపీగా సాగిపోతున్న టైంలో ఒకరోజు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుతుంది. ఆ ప్రమాదంలో నిత్య తీవ్రంగా గాయపడుతుంది. అప్పటినుంచి మైఖేల్ కనిపించకుండాపోతాడు. ఆ షాక్‌‌ వల్ల నిత్య గతాన్ని మర్చిపోతుంది. పీటీఎస్‌‌డీ( PTSD- పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్) అనే వింత మానసిక సమస్య బారినపడుతుంది.

ఆమె తెలియని మగవాళ్లను కలిసినప్పుడు వాళ్లలో మైఖేల్ ముఖం కనిపిస్తుంటుంది. తన కళ్లముందు కనిపిస్తున్నది నిజమా? లేక భ్రమా? అనేది అర్థం కాక తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తుంది. ఒకవైపు ఆ సమస్యతో పోరాడుతూనే అసలు గ్యాస్‌‌ పేలిన రోజు ఏం జరిగింది? తన ప్రియుడు మైఖేల్ ఏమయ్యాడు? అనే నిజాలను అన్వేషిస్తుంది నిత్య. ఈ క్రమంలో ఆమె ఏం తెలుసుకుంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ:

‘ఫేసెస్’ సాధారణ ప్రేమకథ కాదు. ప్రేమ, జ్ఞాపకాలు, మానసిక సంఘర్షణలు, సస్పెన్స్ అంశాలను కలిపి రూపొందించిన సైకలాజికల్ థ్రిల్లర్. కథలోని ప్రధాన బలం నిత్య పాత్ర చుట్టూ తిరిగే మానసిక సమస్య. ప్రమాదం తర్వాత ఆమె ఎదుర్కొనే PTSD, ప్రతి వ్యక్తిలో తన ప్రేమికుడి ముఖం కనిపించడం వంటి అంశాలను దర్శకుడు ఆసక్తికరంగా చూపించాడు.

ఫస్టాఫ్ లో నిత్య పరిస్థితి, ఆమె మానసిక గందరగోళాన్ని స్థాపించడానికి కొంత సమయం తీసుకున్నా, తర్వాత కథ మిస్టరీ మోడ్‌లోకి వెళ్లి ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేస్తుంది. గ్యాస్ సిలిండర్ పేలుడు వెనుక ఉన్న నిజం ఏమిటి? మైఖేల్ ఎందుకు కనిపించకుండా పోయాడు? అనే ప్రశ్నలు కథపై ఆసక్తిని పెంచుతాయి. స్క్రీన్‌ప్లేలో వచ్చే చిన్న చిన్న ట్విస్టులు క్లైమాక్స్ వరకు ఆసక్తిని నిలబెడతాయి.

హన్నా రెజి కోషి తన పాత్రలో అద్భుతంగా నటించింది. భయం, ప్రేమ, అయోమయం, మానసిక వేదన వంటి భావోద్వేగాలను సహజంగా పలికించింది. కాలేష్ రామానంద్ పాత్ర పరిమితంగానే కనిపించినా కథకు కీలకంగా నిలుస్తుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది.

ఫైనల్‌గా: ప్రేమకథకు సైకలాజికల్ థ్రిల్లర్ టచ్ ఇచ్చిన ‘ఫేసెస్’ సస్పెన్స్, ఎమోషన్స్, మానసిక సంఘర్షణలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఓటీటీ ఛాయిస్‌గా చెప్పొచ్చు.