మంత్రి మల్లారెడ్డి.. ఓ బఫూన్: మైనంపల్లి

మంత్రి మల్లారెడ్డి.. ఓ బఫూన్: మైనంపల్లి
  • నన్ను విమర్శించే స్థాయి ఆయనకు లేదు : మైనంపల్లి
  • హరీశ్​రావుపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వెల్లడి

సికింద్రాబాద్, వెలుగు: ‘మంత్రి మల్లారెడ్డి ఒక బఫూన్.. కబ్జాకోరు.. అంగూటాచాప్​కు నన్ను  విమర్శించే స్థాయి లేదు’ అని మల్కాజిగిరి కాంగ్రెస్​ అభ్యర్థి  మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం బీఆర్ఎస్​ ఆశీర్వాద సభలో మైనంపల్లిపై మంత్రులు హరీశ్​​రావు, మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మల్కాజిగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను పది మంది గుండాలను వెంటబెట్టుకుని తిరుగుతున్నానని మల్లారెడ్డి విమర్శలు చేస్తున్నాడు. 

నా కాలు విరిగినా వీల్​చైర్​లో వచ్చి మల్కాజిగిరిలో అభివృద్ధి పనులు చేయించిన. అసలు అభివృద్ధి అంటే నీకేం తెలుసు.. కబ్జాలు చేయడం.. ఆ స్థలాల్లో కాలేజీలు కట్టడం.. సిబ్బందిని, అధ్యాపకులను, చివరకు విద్యార్థులను సైతం ఎన్నికల కోసం వాడుకోడం నీ చరిత్ర కాదా? నీ బతుకే చీకటి బతుకు.. ముసలోడివైనా ఇంకా యువకుడిని అనుకుంటున్నావు.. నీ పిచ్చివేషాలు, నీ బఫూన్​ ప్రసంగాలు ఎవరికి తెలియదు’ అని విమర్శించారు.

 ‘అక్షరం ముక్క తెలియని నీకు మంత్రి పదవి ఎలా వచ్చింది? మల్కాజిగిరి ప్రజలకు నీ అల్లుడి ముఖమే తెలియదు.. ఎంపీగా ఓడిపోయిన అతను ఏనాడు ప్రజాక్షేతంలో లేడు. అలాంటి నీ అల్లుడు ఏమి చేశాడని సీటు ఇచ్చారు?  కోట్లు పెట్టి నీవు, నీ అల్లుడు టికెట్లు కొన్నది వాస్తవం కాదా?’  అని ప్రశ్నించారు. తాను సత్తా ఉన్న నాయకుడిని కాబట్టే కాంగ్రెస్​ పార్టీ రెండు సీట్లు ఇచ్చిందని అన్నారు. ‘మైనంపల్లి గోవిందా కాదు.. మల్లారెడ్డి నువ్వే ఈ ఎన్నికల్లో గోవిందా.. మీ ప్రభుత్వమే గోవిందా..’ అని ఫైర​య్యారు. 

ALSO READ : కాంగ్రెస్ లీడర్ల ఇండ్లపై ఐటీ దాడులు

ఇప్పటికీ హరీశ్​​ పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, లబ్బరు చెప్పులు, ట్రంకు పెట్టెతో వచ్చిన హరీశ్​కు ఇన్ని వేల కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, అందుకే పిల్లర్లు కుంగుతున్నయ్​, లీకేజీలు అవుతున్నాయని విమర్శించారు.