మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు.. ఆయన అనుచరులపైనా ఎఫ్ఐఆర్

మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు..  ఆయన అనుచరులపైనా ఎఫ్ఐఆర్

శామీర్ పేట, వెలుగు: మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అనుచరులు ఏడుగురిపై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. శామీర్ పేట పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో 47 ఎకరాల18 గుంటల భూమిని దాదాపు 40 ఏండ్ల కిందట కాంగ్రెస్​ ప్రభుత్వం ఎస్టీలకు ఇచ్చింది. ఈ మొత్తం భూమి ఏడుగురి పేర్ల మీద ఉండగా.. వాళ్లంతా కాలం చేశారు. భిక్షపతి నాయక్​ అనే వ్యక్తి మినహా వారి వారసులంతా.. ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈ భూమిపై కన్నేసిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి దాన్ని కాజేయాలని కుట్ర చేశారు. తన అనుచరులు శ్రీనివాసరెడ్డి, హరిమోహన్ రెడ్డి, మధుకర్ రెడ్డి, శివుడు, స్నేహరామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డి కేశవరం గ్రామంలోని భిక్షపతి నాయక్​ను కలిసి మాట్లాడారు.

 ఆ భూమిని మొత్తం తమకు ఇప్పిస్తే.. డబ్బులు ఇస్తామని ఆశచూపారు. సుమారు 3 లక్షల చెల్లించి దాదాపు రూ.250 కోట్ల విలువ చేసే ఆ భూమిని పీటీ సరెండర్​చేయించుకొని ఈ ఏడాది నవంబర్​3వ తేదీని ఓ వ్యక్తిపై రిజిస్ట్రేషన్​చేయించారు. ఆ వ్యక్తి తమకు విక్రయించినట్లుగా తెల్లవారి రాత్రికి రాత్రే తమ పేరిట రిజిస్ట్రేషన్​చేయించుకున్నారు. వీళ్ల మోసాన్ని పసిగట్టిన భిక్షపతి నాయక్​ఆ భూమి వారసులకు సమాచారం ఇచ్చి నవంబర్18న శామీర్​పేట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు ఏడుగురిపై డిసెంబర్​6న కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్ పేట సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్​అధికార పార్టీ అండతో రాత్రి11 గంటలకు మూడుచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వాణి రెడ్డి అక్రమంగా 47.18 ఎకరాల భూమిని మాజీ మంత్రి అనుచరులపై రిజిస్టర్ చేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని బుధవారం శామీర్​పేట పోలీస్​స్టేషన్​ ముందు ధర్నా నిర్వహించారు.