మల్లన్న సాగర్​తో ఆగమైపోతున్నం...ఊళ్లే ఉండలేకపోతున్నం

మల్లన్న సాగర్​తో ఆగమైపోతున్నం...ఊళ్లే ఉండలేకపోతున్నం
  • మల్లన్న సాగర్​తో ఆగమైపోతున్నం...ఊళ్లే ఉండలేకపోతున్నం
  • .ఊట నీళ్లతో ఇబ్బందులు..  సెప్టిక్​ ట్యాంకుల నుంచి పాములు, తేళ్లు
  • అదనపు టీఎంసీ కాల్వ పనులతో ఇండ్లకు బీటలు
  • ఆఫీసర్లు, లీడర్లు తమను ఆదుకోవాలని వేడుకోలు

సిద్దిపేట/తొగుట, వెలుగు:   మల్లన్న సాగర్  రిజర్వాయర్ సిద్దిపేట జిల్లా  తొగుట మండలం తుక్కాపూర్ ప్రజల తలరాతను  మార్చేసింది.  రిజర్వాయర్​ నిర్మాణానికి ముందు గ్రామస్థులు వ్యవసాయంతోపాటు కూరగాయలు  సాగు చేస్తూ కుటుంబాలను పోషించుకునేవారు.  ప్రతీ రోజు గ్రామం నుంచి కూరగాయలను హైదరాబాద్ కు తీసుకెళ్లి అమ్ముకుని ఆదాయాన్ని పొందేవారు.  మల్లన్న సాగర్ నిర్మాణంతో గ్రామస్థుల జీవనాధారం పోవడంతో పాటు కనీసం ఊళ్లో ఉండలేని పరిస్థితి దాపురించింది.   రిజర్వాయర్ కట్టకు కేవలం వంద మీటర్ల దూరంలోనే ఈ ఊరు ఉంది.   తుక్కాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో   1,300 మంది నివసిస్తున్నారు.  గ్రామ పరిధిలో   1,600 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా  1,300 ఎకరాలను ప్రభుత్వం మల్లన్న సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు కోసం సేకరించింది.    ఆ భూమిలో  మల్లన్న సాగర్  రిజర్వాయర్ ఓ వైపు,  మరో వైపు విద్యుత్ సబ్ స్టేషన్  నిర్మించారు.  తర్వాత  కొద్దికాలానికి   మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మానేరు నుంచి మల్లన్న సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  అదనంగా టీఎంసీ నీటిని తేవడానికి కాల్వ నిర్మాణానికి   ఊరిలో ఉన్న కొద్దిపాటి భూమిని సేకరించింది.  దీంతో  గ్రామానికి మూడో వైపు అదనపు టీఎంసీ పనులతో వ్యవసాయానికి అనువైన భూమే లేకుండా పోయింది.    జీవనాధారం పోవడంతో పాటు గ్రామానికి మూడు వైపులా  భారీ నిర్మాణాలతో   కొత్త ఇబ్బందులు వస్తుండడంతో గ్రామస్థులకు  కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.    

సమస్యలతో సహవాసం..

మల్లన్న సాగర్ రిజర్వాయర్  పక్కనున్న తుక్కాపూర్  ప్రజలు  నిత్యం సమస్యలతో సహవాసం చేస్తున్నారు.  వ్యవసాయం చేసే పరిస్థితి లేకపోవడంతో  పలువురు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లివస్తున్నారు.  వీరిలో ఎక్కువగా రోజువారీ  కూలీ కోసం వెళ్తున్న వారే అధికం.  పక్కనే 50 టీఎంసీల కెపాసిటీ కలిగిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ దగ్గరలోనే ఉండడంతో  గ్రామంలోని ఇండ్లకు ముప్పుగా మారింది.  రిజర్వాయర్ వల్ల  భూమిలోంచి  నీరు రావడంతో సెప్టిక్ ట్యాంకులు నిండి  బయటకు రావడంతో పాటు పాములు, తేళ్లు ఇండ్లల్లోకి వస్తున్నాయి.  దీనికి తోడు రిజర్వాయర్​తోపాటు అడిషనల్ టీఎంసీ కోసం కాల్వ నిర్మిస్తుండగా  పెద్ద పెద్ద బండరాళ్లు బ్లాస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా ఇండ్లు బీటలువారాయి.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఎదురుచూపు..

నిన్నమొన్నటి దాకా తుక్కాపూర్ వాసులు తమ పెండింగ్ పరిహారాల కోసం ఆందోళన చేశారు. ఇప్పుడు  గతంలో హామీ ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారు.  తుక్కాపూర్ వద్ద అదనపు టీఎంసీ కాల్వ నిర్మాణానికి  భూసేకరణ సందర్భంగా ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్న   గ్రామస్థులను ఆదుకోవడానికి రెండేండ్ల కింద అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ముందుకొచ్చారు.  ఈ సందర్భంగా ఒక్కో కుటుంబానికి కాన్గల్  దగ్గరలో  250 గజాల  ఇంటి స్థలాన్ని  ఇస్తామని హామీ ఇవ్వగా, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తన కోటాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.

ఇండ్ల కోసం  ఆందోళన..

డేంజర్​గా మారిన ఇండ్లల్లో  ఉండడం కష్టంగా ఉందని, వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.  రెండేండ్లుగా ఓపిగ్గా ఎదురుచూసిన తమను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇటీవల అదనపు టీఎంసీ కాల్వ నిర్మాణ పనులను అడ్డుకున్నారు.  ఈ సందర్భంగా సమస్యను రెవెన్యూ ఆఫీసర్ల దృష్టికి తీసుకు వెళ్తామని ఇరిగేషన్ ఆఫీసర్లు హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. .

న్యాయం చేయాలే..

మల్లన్న సాగర్ నిర్మాణంతో సర్వం కోల్పోయిన గ్రామస్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలే. గతంలో హామీ ఇచ్చినట్టుగా 250 గజాల స్థలంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలే.  రెండేండ్లుగా ఆఫీసర్ల చుట్టు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకుంటలేరు.   గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆందోళనకు దిగి అదనపు టీఎంసీ పనులను అడ్డుకోవాల్సి వస్తోంది.  - చిక్కుడు చంద్రం, సర్పంచ్, తుక్కాపూర్

ఊరిలో ఉండేటట్టు లేదు..
రోజురోజుకూ ఊళ్లో ఉండలేని పరిస్థితి ఏర్పడుతాంది. రిజర్వాయర్​తో  భూమిలోంచి నీళ్లు వస్తున్నయ్​..   బ్లాస్టింగ్​లతో  ఇండ్లు దెబ్బతిన్నయ్​. ఈ విషయంలో ప్రభుత్వం  మాకు న్యాయం చేయాలే. గతంలో హామీ ఇచ్చినట్టు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలే. - బోయిని యశోద, తుక్కాపూర్