
దర్శకుడు హరీష్ శంకర్ తనని పవన్ కళ్యాణ్ చిత్రంలో విలన్ గా నటించమని గంటన్నరసేపు బతిమిలాడారని, కానీ తాను చేయనని చెప్పానని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మార్చి 26న హైదరాబాద్‌లో జరిగిన ‘మేమ్ ఫేమస్’ టీజర్ విడుదల కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. యవత కష్టపడి పనిచేసి సక్సెస్ ను అందుకోవాలని చెప్పారు. ప్రస్తుతం యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగ పరచుకోవాలని మంత్రి సూచించారు.
23 ఏళ్ల వయసులో తనకు పెళ్లి అయిందని అప్పుడు తాన దగ్గర ఏమీ లేదని పాలు అమ్మానని మల్లారెడ్డి గుర్తుచేసుకున్నారు. తాను జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చానని, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యానని వెల్లడించారు. తనకు ‘మేమ్ ఫేమస్’ చిత్ర టీజర్ ఎంతో నచ్చిందని తప్పకుండా చిత్రం సక్సెస్ అవుతుందని నమ్ముతున్నానని అన్నారు. ఇది సక్సెస్ అయ్యాక ఈ హీరోతో తానొక సినిమా చేస్తానని, ఎన్నికలు అయ్యాక తెలంగాణ యాసలో పలు చిత్రాలు నిర్మిస్తానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.