బోడుప్పల్ కార్పోరేటర్ కారుకు మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్

బోడుప్పల్ కార్పోరేటర్ కారుకు మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్

మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్​లోని ఓ  కార్పొరేటర్ కారుకు సోమవారం మంత్రి మల్లారెడ్డి పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ కనిపించింది. ఇటీవల క్యాసినో కేసులో నిందితుల కార్లకు మంత్రి మల్లారెడ్డి పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటం వివాదంగా మారిన విషయం తెలిసిందే. వాడి పడేసిన స్టిక్కర్​ను ఎవరో అతికించుకుంటే తనకెలా తెలుస్తుందని మల్లారెడ్డి ఆ సమయంలో వివరణ ఇచ్చారు. తాజాగా 
బోడుప్పల్ కార్పొరేషన్  ఒకటో డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య కారుకు కూడా (టీఎస్ 08ఎఫ్ వి 1116) మంత్రి మల్లారెడ్డికి పేరుతో ఎమ్మెల్యే  స్టిక్కర్ ఉండటం చర్చనీయాంశంగా మారింది.

మల్లారెడ్డే  స్టిక్కర్​ను ఇచ్చారా ? లేక జిరాక్స్  కాపీ అతికించారా అనే చర్చ జరుగుతోంది. తన దగ్గర 3 స్టిక్కర్లు ఉండగా.. వాటిని కుటుంబసభ్యుల కార్లకు మాత్రమే వాడుతున్నానని గతంలో మల్లారెడ్డి చెప్పారు.కానీ ప్రస్తుతం కార్పొరేటర్​ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. ఈ స్టిక్కర్ కేవలం ఎమ్మెల్యేల వెహికల్స్ కు మాత్రమే వాడాలనే రూల్ ఉన్నప్పటికీ ఇలా దుర్వినియోగం కావడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.