14 ఏళ్లుగా అన్నం ముట్టని మల్లవ్వ

14 ఏళ్లుగా అన్నం ముట్టని మల్లవ్వ

మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే సరైన ఆహారం కావాలి. కానీ ఎలాంటి ఆహారం తినకుండానే  రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ మహిళ ఆరోగ్యంగా జీవిస్తోంది.  సుద్దగడ్డలు, మంచినీటితో జీవనం సాగిస్తోంది. 

 రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్  గ్రామానికి  చెందిన మల్లవ్వ 14 ఏళ్లుగా అన్నం తినకుండా జీవనం సాగిస్తోంది. అన్నానికి బదులు సుద్ద గడ్డలు తింటోంది. ఒకసారి  వ్యవసాయ పనులకు వెళ్లి ఇంటికొచ్చిన మల్లవ్వకు  ఆకలిగా ఉండడంతో పళ్లెంలో అన్నం పెట్టుకొని తినేందుకు ప్రయత్నించింది. పళ్లెంలోని అన్నం పురుగులుగా కనిపించడంతో తినలేకపోయింది. మరుసటి రోజు ఉదయం అదే పరిస్థితి ఎదురయ్యింది. అప్పటి నుంచి 14 ఏళ్లుగా ఆహారాన్ని ముట్టకుండా బతికేస్తోంది. బలవంతంగా అన్నం తింటే ఆరోజు మొత్తం కడుపునొప్పితో అల్లాడిపోతుంది. 

 ఊరిలోని ఒకే బావి నీరు త్రాగుతూ, సుద్దగడ్డలను తింటూ  మల్లవ్వ జీవిస్తోంది. ఈ పరిస్థితి చూసిన కొడుకు, కోడలు మల్లవ్వకు ఏదో అయిందని ఆసుపత్రికి తీసుకెళ్లారు.  డాక్టర్ అన్నీ పరీక్షలు చేసి, ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చారు. మల్లవ్వను చూసి బంధువులు, గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు.