గుండెకు హత్తుకోవడం ఖాయం : చేనేత ‘మల్లేశం’ ట్రైలర్ విడుదల

గుండెకు హత్తుకోవడం ఖాయం : చేనేత ‘మల్లేశం’ ట్రైలర్ విడుదల

చేనేతకు సాంకేతికత జోడించి.. సరికొత్త ఆవిష్కరణ చేసిన చింతకింది మల్లేశం జీవిత విశేషాలతో రూపొందిన సినిమా మల్లేశం. ఆయన పేరుతోనే ఈ సినిమాను నిర్మించారు. చేనేత కార్మికుడిగా పనిచేస్తూనే కొత్త ఆవిష్కరణలు చేసిన చింతకింది మల్లేశంకు .. కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందించింది.

ఈ ఉత్తమమైన గ్రామీణ నేపథ్య కథాంశాన్ని సినిమాగా రూపొందించారు. నటుడు ప్రియదర్శి మల్లేశంగా టైటిల్ రోల్ పోషించాడు. పూర్తి తెలంగాణ నేటివిటీతో … తెలంగాణ మాటలతో .. ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఓ తల్లి పడే బాధను దూరం చేయాలనుకునే కొడుకు ఆశ.. ఎంత గొప్ప ఫలితాలను ఇచ్చిందన్నదే ఈ కథ.

ప్రియదర్శితో పాటు.. అనన్య, ఝాన్సీ ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్.ఆర్ ఈ సినిమా నిర్మించి దర్శకత్వం వహించారు. శ్రీ అధికారి మరో నిర్మాత. మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.సురేష్ బాబు సమర్పణలో ఈ మూవీ వస్తోంది.

జూన్ 21న సినిమా విడుదల కానుంది.

ఎవరీ ‘మల్లేశం’..?

చింతకింది మల్లేశంది యాదాద్రి జిల్లా ఆలేరు మండలం శారాజీపేట. ఆరో తరగతిలో బడి బంద్ చేశాడు మల్లేశం. తల్లి లక్ష్మికి చేనేతలో సాయపడుతూ.. ఆ తర్వాత మళ్లీ టెన్త్ పాసయ్యాడు. 2000 ఏడాదిలో ఆయన కనిపెట్టిన ఆసు యంత్రం… చేనేతలో ఓ విప్లవంగా చెబుతారు. కండెల చుట్టూ దారాన్ని 9 వేల సార్లు అటూ ఇటూ తిప్పితే… ఒక చీరకు ఆసు పోయడం పూర్తవుతుంది. దారాన్ని అటూ ఇటూ తిప్పుతూ.. ఆయన తల్లి భుజం నొప్పితో బాధపడేది. అమ్మకు కష్టం దూరం చేయాలనే ఉద్దేశంతో ఓ యంత్రం కనిపెట్టాలనుకున్నాడు మల్లేశం. అలా ఏడేళ్ల పాటు శ్రమించి ఆసు యంత్రం తయారుచేశాడు.

ఈ యంత్రం సాయంతో రోజుకు ఒకట్రెండు చీరలకు బదులుగా ఆరు చీరలు నేసేంత సాంకేతిక సాయం అందుబాటులోకి వచ్చింది.

తల్లి పేరుమీద.. ఈ యంత్రానికి ఆసుయంత్రం అని పేరు పెట్టారు మల్లేశం. దీనికి 2011లో ఆయన పేటెంట్ దక్కించుకున్నారు. అదే ఏడాదిలో ఆవిష్కర్తల లిస్టులో మల్లేశం పేరు చేర్చింది ఫోర్బ్స్. ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డ్ అందుకున్న మల్లేశంకు.. 2017లో నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.