
ముంబై: ‘కబుతర్ ఖానాల’ల్లో పావురాలకు ఆహారం ఇవ్వడంపై బాంబే హైకోర్టు విధించిన నిషేధం విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పావురాలకు ఆహారం ఇచ్చే వారిపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని గతంలో హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జంతు ప్రేమికులు, హక్కుల కార్యకర్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌ను జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన బెంచ్ సోమవారం విచారించింది. కేసుకు సంబంధించిన విచారణలు హైకోర్టులో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. హైకోర్టుకు సమాంతరంగా తమ తీర్పును వెల్లడించలేమని పేర్కొంది. ఇది సరైనది కాదని చెప్పింది. పావురాలకు ఆహారం ఇవ్వడాన్ని నిషేధిస్తూ ఇచ్చిన ఉత్తర్వును సవరించాలని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.