అన్ని డైట్ కాలేజీల్లో డీపీఎస్ఈ కోర్సు!

అన్ని డైట్ కాలేజీల్లో డీపీఎస్ఈ కోర్సు!

పర్మిషన్ కోసం ఎన్​సీటీఈకి లేఖ రాయాలని విద్యాశాఖ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్) కాలేజీల్లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు ఎన్​సీటీఈ అనుమతి కోసం లేఖ రాయనున్నారు. ప్రస్తుతం పది సర్కారు డైట్ కాలేజీలు ఉండగా, కేవలం మెదక్ జిల్లాలోని డైట్ కాలేజీలోనే డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్​ఈ) కోర్సు ఉంది. వరంగల్ జిల్లాలోని ఓ ప్రైవేటు డైట్​ కాలేజీలో ఆ కోర్సు ఉంది. అయితే, ప్రస్తుతం అన్ని సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 

ఈ ఏడాది ఇప్పటికే వెయ్యి బడుల్లో తరగతులు స్టార్ట్ చేసింది. వచ్చే రెండు, మూడు ఏండ్లలో అన్ని సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రీప్రైమరీ స్టూడెంట్లకు క్లాసులు చెప్పేందుకు ట్రైన్డ్ ఫ్యాకల్టీని రెడీ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు స్కూళ్లలోనూ డీపీఎస్ఈ కోర్సు చేసిన వాళ్లు లేరు. డీఈడీ, ఇంటర్ పూర్తి చేసిన వారితోనే క్లాసులు చెప్పిస్తున్నారు. ప్రీప్రైమరీ స్టూడెంట్లకు అర్థమయ్యేలా క్లాసులు ఉండాలంటే.. వారికి ట్రైనింగ్ అవసరమని అధికారులు భావిస్తున్నారు. 

డీపీఎస్ఈకి ఆదరణ కరువు.. 

ప్రస్తుతం డీపీఎస్ఈ కోర్సుకు రాష్ట్రంలో పెద్దగా డిమాండ్ కూడా లేదు. మెదక్ కాలేజీలో 50 సీట్లుంటే కేవలం 20 లోపే అడ్మిషన్లు అయ్యాయి. అయితే, ఈ కోర్సు చేసిన వారికి టెట్, డీఎస్సీకి ఎలిజిబులిటీ లేదు. దీంతో ఈ కోర్సులో చేరేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఈ కోర్సును ప్రమోట్ చేయాలనే ఉద్దేశం ఉంటే.. కొన్ని నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్తున్నారు.