
- నేడు కాంట్రాక్టర్లతో మంత్రులు కోమటిరెడ్డి, సీతక్క భేటీ
- ప్రాజెక్టు గురించి వివరించనున్న మినిస్టర్లు
- 40 శాతం ప్రభుత్వం, 60 శాతం కాంట్రాక్టర్ల వాటా
- మీటింగ్ కు అటెండ్ కానున్న పలు బ్యాంకుల ఉన్నతాధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టవ్యాప్తంగా రోడ్ల రిపేర్లు చేపట్టడానికి ప్రభుత్వం అమలు చేయనున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) ప్రాజెక్టుకు ఈ నెలలో ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. ఈ మేరకు ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత నెలలో ఆర్ అండ్ బీ పరిధిలో రూ.6478.33 కోట్లతో 5190.25 కిలోమీటర్ల మేర 373 రోడ్లను 17 ప్యాకేజీలుగా విభజిస్తూ ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ జీఓ జారీ చేశారు. పంచాయతీ రాజ్ పరిధిలో రాష్ట్రంలో మూడు విడతల్లో మొత్తం 18,472 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను హ్యామ్ విధానంలో నిర్మించేందుకు కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది.
మొదటి విడతలో 7,947 కిలోమీటర్లకు సంబంధించిన 2,254 రోడ్లకు మరమ్మతులు చేపట్టనున్నారు. పీఆర్ రోడ్లకు సంబంధించి త్వరలో ప్రభుత్వం జీఓ జారీ చేయనుంది. ప్రైవేట్ కన్సల్టెంట్లు ఇచ్చిన డీపీఆర్ లను ఈ రెండు శాఖల అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రెండు శాఖల్లో ఎస్ఈ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేకంగా అధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ పక్రియ దాదాపుగా చివరి దశకు చేరుకుందని అధికారులు తెలిపారు. హ్యామ్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక మీటింగ్ మంగళవారం జరగనుంది.
హైదరాబాద్ లోని మాదాపూర్ లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ర్టక్షన్ (న్యాక్) లో జరగనున్న ఈ మీటింగ్ కు ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, నేషనల్ హైవేలు, ఇతర రాష్ర్టాల్లో రోడ్ల పనులు చేస్తున్న 120 మంది కాంట్రాక్టర్లు హాజరు కానున్నారు. వీరితో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు ఉన్నతాధికారులను కూడా అధికారులు ఆహ్వానించారు. హ్యామ్ ప్రాజెక్టు లక్ష్యం, రెండు శాఖల్లో చేపట్టాల్సిన రోడ్ల రిపేర్లు, ప్రభుత్వ లక్ష్యాలు, కాంట్రాక్టర్లకు రాష్ర్ట ప్రభుత్వం చెల్లించే వాటా అమౌంట్, బ్యాంకులకు ప్రభుత్వం ఇవ్వనున్న షూరిటీ వంటి అంశాలను మంత్రులు, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు వివరించనున్నారు. కాంట్రాక్టర్ల సందేహాలను తీర్చనున్నారు.
ఎన్ హెచ్, జీహెచ్ఎంసీలో అమలవుతున్న హ్యామ్
హ్యామ్ ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వాటా 40 శాతం కాగా, మిగిలిన 60 శాతం నిధులను కాంట్రాక్టర్లు లేదా ఏజెన్సీలే సమీకరించాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత 15 ఏండ్ల పాటు నిర్వహణ బాధ్యత సైతం కాంట్రాక్టర్లే చూసుకోవాల్సి ఉంటుంది. హ్యామ్ విధానం అన్ని రాష్ర్టాల్లో నేషనల్ హైవేల్లో, జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే అమలవుతుండగా.. ఇపుడు ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రోడ్లలోనూ అమలు కానుంది. ఎన్ హెచ్, గ్రేటర్ లో విజయవంతమైన ఈ విధానాన్ని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడు, కర్నాటక, మహరాష్ట్ర, రాజస్తాన్, యూపీ వంటి 12 రాష్ట్రాల్లో ఈ విధానం విజయవంతమైంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో హ్యామ్ ప్రాజెక్టులో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు నివేదిక అందజేశారు.