
- రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చింది: మంత్రి వివేక్
- ఇసుక మాఫియాఅందినకాడికి దోచుకున్నది
- 17 లక్షల ఇందిరమ్మఇండ్లు నిర్మించి ఇస్తం
- నాగర్కర్నూల్ జిల్లాలో పలుఅభివృద్ధి పనులకు శంకుస్థాపన
నాగర్ కర్నూల్/అచ్చంపేట వెలుగు: ప్రజా ధనాన్ని దోచుకునేందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కాళేశ్వరం కాంట్రాక్టర్లంతా.. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్కు భారీగా నిధులు ఇచ్చారని విమర్శించారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రూ.3 కోట్లతో నిర్మించిన మున్సిపాలిటీ భవనాన్ని ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్ రెడ్డితో కలిసి మంత్రి వివేక్ సోమవారం ప్రారంభించారు. అనంతరం రూ.3 కోట్లతో బల్మూరు మండలం రామాజీపల్లి, కొండనాగుపల్లి బీటీ రోడ్డు నిర్మాణానికి, కొండనాగుల గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించే పంచాయతీ భవనానికి, రూ.1.50 కోట్లతో వేయనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
తర్వాత అదే గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి వివేక్ మాట్లాడారు. ‘‘దేశంలో ఏ పార్టీ వద్ద లేనంత ఫండ్.. బీఆర్ఎస్ కు ఎక్కడి నుంచి వచ్చింది? ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం రేవంత్ చక్కదిద్దుతున్నారు. తెలంగాణను అభివృద్ధి పథంవైపు తీసుకెళ్తున్నారు. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ లీడర్ల వద్ద డబ్బుల్లేవు. ఇప్పుడు వేల కోట్లు పోగేసుకున్నరు.
ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇసుక మాఫియా రాష్ట్రాన్ని దోచుకున్నది. ఆ వ్యవస్థను ప్రక్షాళన చేసి.. తక్కువ ధరకు ఇసుక సప్లై చేస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్స్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మేము అధికారంలోకి వచ్చాక 10వేల టీచర్ పోస్టులను భర్తీ చేశాం. పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచినం. రాష్ట్రంలో 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు నిర్ణయించాం. ఆర్థిక ఇబ్బందులున్నా.. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు, బీసీలకు మేలు చేస్తున్నదని’’అని వివేక్ అన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థను అంబేద్కర్ గాడిలో పెట్టారు
అణిచివేతకు గురైన జనాల కోసం కొట్లాడిన మహానేత అంబేద్కర్ అని మంత్రి వివేక్ వెంకటస్వామి కొనియాడారు. కార్మికులు 8 గంటలు మాత్రమే పని చేసేలా చట్టం తీసుకొచ్చారని, రిజర్వ్ బ్యాంకును స్థాపించి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని గుర్తు చేశారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కాకుండా అగ్రకులాల్లోని పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పించే అవకాశం రాజ్యాంగం ద్వారా సాధ్యమైంది. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే రాహుల్ గాంధీ బీజేపీపై పోరాటం చేస్తున్నారు. అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకుని మన హక్కుల కోసం పోరాడాలి’’అని వివేక్ అన్నారు. ప్రజలకు ఓటు అనే ఆయుధాన్ని అంబేద్కర్ అందించారని, ఆ హక్కు ప్రజలకు దక్కకుండా బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతున్నదని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ విమర్శించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ సాధ్యమైందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, ఆర్డీవో మాధవి, రెంజర్ల రాజేశ్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, ఉమామహేశ్వర చైర్మన్ మాధవ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, మార్కెట్ చైర్మన్ రజిత మల్లేశ్, నేతలు వెంకటరెడ్డి, గిరి వర్ధన్ గౌడ్, రాంప్రసాద్ గౌడ్, ఖదీర్, శ్రీనివాసులు, సుధాకర్ గౌడ్, అరుణమ్మ, మల్లేశ్, గడ్డం తిరుపతయ్య, రమేశ్, శైలజ, రమేశ్ రావు, శివ తదితరులు పాల్గొన్నారు.