
- ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించేందుకు రెడీ
- ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేందుకు ఢిల్లీలో వసతులు కల్పిస్తున్నం
- రాజీవ్ సివిల్స్ అభయహస్తం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం
- సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన 178 మందికి లక్ష చొప్పున సాయం
- ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి అదనంగా మరో లక్ష
- హాజరైన మంత్రులు వెంకట్‌రెడ్డి, పొన్నం, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, మక్కాన్‌సింగ్, గండ్ర
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నుంచి సివిల్ సర్వీసెస్‌లో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. సివిల్స్ అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సాయం అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. సోమవారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన రాజీవ్ అభయహస్తం కార్యక్రమంలో సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన 178 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మానవ వనరులను బలమైన పెట్టుబడిగా భావిస్తున్నదని, హ్యూమన్ రిసోర్స్‌ను సానబట్టి వజ్రాలుగా తీర్చిదిద్దితే సమాజానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. సివిల్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో కొంత సాయం చేస్తే వారి లక్ష్య సాధనకు ఉపయోగపడుతుందని ప్రజా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. అభ్యర్థులకు మనోధైర్యం కల్పించేందుకు వరుసగా రెండో ఏడాది కూడా రాజీవ్ అభయహస్తం కార్యక్రమాన్ని చేపట్టినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. మెయిన్స్, ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు ఆర్థిక సాయంతోపాటు ఢిల్లీలో వసతులు కల్పిస్తామని భట్టి హామీ ఇచ్చారు. నిరుడు 148 మందికి సాయం అందించగా, వారిలో 10 మంది సివిల్స్‌లో ఎంపికయ్యారని, మరో 10 మంది ఇతర సర్వీసులకు సెలెక్ట్ అయ్యారనివెల్లడించారు.
జిల్లాలవారీగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు: మంత్రి వెంకట్‌రెడ్డి
రాష్ట్ర యువత టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక అనేక అవకాశాలు కోల్పోతున్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. జిల్లాలవారీగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సివిల్స్‌కు ఎంపికైతే ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని గొప్ప ఆశయంతో అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు సాధ్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా తాను, తన సోదరుడు వివేక్ ఆధ్వర్యంలో విద్యాసంస్థను నిర్వహిస్తూ 50 వేల మందికి విద్యను అందిస్తున్నామని గుర్తు చేశారు.
30 మంది సివిల్స్ విజేతలకు సత్కారం
2024లో రాజీవ్ అభయహస్తం పథకం కింద లబ్ధి పొంది11వ ర్యాంకు సాధించిన సాయి శివానీతోపాటు రాష్ట్రం నుంచి సివిల్స్, ఫారెస్ట్ సర్వీసులకు ఎంపికైన 30 మందిని రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలో సత్కరించారు. మెమోంటోలను అందించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మాక్ ఇంటర్వ్యూల ద్వారా లబ్ధి పొందిన కర్నాటకకు చెందిన ఒకరికి, మహారాష్ట్ర నుంచి ఒకరికి జ్ఞాపికలను అందజేశారు. సింగేణి సీఎండీ ఎన్ బలరామ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్‌ఠాకూర్, గండ్ర సత్యనారాయణ, కనీస వేతనాల కమిటీ చైర్మన్ జనక్‌ప్రసాద్, సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణరావు, సూర్యనారాయణ, కే వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, అధికార సంఘం నాయకులు లక్ష్మీపతి గౌడ్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అవకాశం..
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో బ్యూరోక్రసీ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు సివిల్ సర్వీసెస్ ద్వారా అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో ఎస్‌ఆర్ శంకరన్, పార్థసారథి, మాధవరావులాంటి ఐఏఎస్ అధికారులు నిబద్ధతతో సేవలందించారని గుర్తు చేశారు. అధికారుల్లో చిత్తశుద్ధి లోపిస్తే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరవని, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు పూర్తిగా చేరితేనే ఫలితాలు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థలో 45 వేలకు పైగా కార్మికులు పనిచేస్తూ లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారని, వారి ఆశీస్సులతో అభ్యర్థులు విజయం సాధిస్తారని భట్టి ఆకాంక్షించారు.