
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షులు మళ్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ 11 ఏళ్లలో 151 ఫారెన్ ట్రిప్స్ కు వెళ్లారని.. 72 దేశాలు తిరిగి ఏం సాధించారని ప్రశ్నించారు. మోదీ నిర్విరామంగా తిరుగుతూనే ఉన్నారని.. దౌత్యపరంగా సాధించేమీ లేదని ఈ సందర్భంగా అన్నారు. మంగళవారం (మే 20) ప్రధాని విదేశీ పర్యటనలు, అంతర్జాతీయ విధానంపై ఖర్గే పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
151 విదేశీ పర్యటనలలో అమెరికాకు 10 సార్లు వెళ్లిన మోదీ.. యూఎస్ తో పాటు ప్రపంచ దేశాల నుంచి ఎంత వరకు మద్ధతు కూడగట్టారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని మోదీ విధానాలతో అంతర్జాతీయంగా భారత్ ఏకాకిగా మారుతున్నట్లు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
మోదీ విధానాలతో ప్రపంచ దేశాల నుంచి భారత్ సంపూర్ణ మద్ధతు కూడగట్టలేకపోతోందని అన్నారు. కేవలం ఫోటోలు తప్ప మోదీ పర్యటనలతో సాధించేమీ లేదని ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘‘మన ప్రధాని విధులు కేవలం విదేశాలు తిరగటం.. ఫోటోలు దిగటమేనా’’ అని ప్రశ్నించారు.
ALSO READ | ఆధునిక యుగపు మీర్ జాఫర్: రాహుల్ గాంధీపై బీజేపీ సంచలన వ్యాఖ్యలు
మోదీ బలమైన నేత అని చెప్పుకుంటున్నారని.. అదే నిజమైతే భారత్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండా ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (IMF) పాకిస్తాన్ కు 1.4 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం ఎలా చేస్తుందని అన్నారు. అదే విధంగా ఉగ్రమూకలను ఏరివేసే క్రమంలో అంత అత్యవసరంగా కాల్పుల విరమణ చేయడమేంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఖర్గే.
ఇండియా-పాకిస్తాన్ కాల్పుల విరమణ తన వల్లేనని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటుంటే.. కనీసం దానిపై మాట్లాడే ధైర్యం కూడా మోదీకి లేదని అన్నారు. ట్రంప్ వ్యవహారం చూస్తుంటే ఇండియా ఫారిన్ పాలసీ విషయంలో మోదీకి క్లారిటీ లేనట్లు స్పష్టం అవుతుందని విమర్శించారు.
ఇండియా-పాకిస్తాన్ సీజ్ ఫైర్ కు తానే మధ్యవర్తిత్వం వహించానని ఇప్పటికి 7 సార్లు ట్రంప్ ప్రకటించడంతో భారత్ ను అవమానించాడని మండిపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో.. యుద్ధ వాతావరణంలో దేశం అంతా ఏకమైందని, కానీ ట్రంప్ విషయంలో క్లారిటీ ఇవ్వలేక మోదీ కవర్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారని విమర్శించారు.
పహల్గాం టెర్రర్ అటాక్ ఘటనలో భారత్ భద్రతా లోపం ఉందని విమర్శిస్తూ వస్తున్న ఖర్గే.. తాజాగా మోదీ విదేశీ విధానంపై ఘాటు విమర్శలు గుప్పించారు.