ఆధునిక యుగపు మీర్ జాఫర్: రాహుల్ గాంధీపై బీజేపీ సంచలన వ్యాఖ్యలు

ఆధునిక యుగపు మీర్ జాఫర్: రాహుల్ గాంధీపై బీజేపీ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి జైశంకర్‎పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తోన్న విమర్శలకు బీజేపీ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టింది. రాహుల్ గాంధీ పాకిస్థాన్ భాషలో మాట్లాడుతున్నాడని, జాతీయ భద్రతను దెబ్బతీస్తున్నాడని విమర్శలు గుప్పించింది. రాహుల్ గాంధీ ఆధునిక యుగపు మీర్జా జాఫర్ అని బీజేపీ అభివర్ణించింది. ఈ మేరకు బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా మంగళవారం (మే 20) సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. 

ఆపరేషన్ సిందూర్‎లో భారత్ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయిందో చెప్పాలంటున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆపరేషన్ సిందూర్ గురించి తప్పుడు కథనాన్ని అల్లడానికి పాక్ అస్త్రంగా మార్చుకుంటుందని ఫైర్ అయ్యారు. రాహుల్ లేవనెత్తిన సందేహాంపై రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే వివరణ ఇచ్చినప్పటికీ.. అతడు మళ్లీ అవే వ్యాఖ్యలు చేస్తున్నాడని.. రాహుల్ వ్యాఖ్యలను పాకిస్థాన్ తమకు అనుకూలంగా మార్చుకుంటుందని దుయ్యబట్టారు. అయినా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలలో సంతోషంగా ఉపయోగించకోవడం ఇదేమి కొత్త కాదని ఎద్దేవా చేశాడు. 

రాహుల్ మాటలు సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సాహించే వారికి కవర్‌గా పని చేస్తాయని అన్నారు. నష్టాలపై దృష్టి సారించి భారత సైనిక విజయాలను అంగీకరించడానికి రాహుల్ గాంధీ నిరాకరించడం పాకిస్తాన్ సందేశంతో ముడిపడి ఉందని.. రాహుల్ గాంధీ ఆధునిక యుగం మీర్ జాఫర్ అని అభివర్ణించారు మాల్వియా. భారత్ ఎన్ని యుద్ధ విమానాలు నష్టపోయిందో చెప్పాలని పదే పదే అడుగుతోన్న రాహుల్.. పాకిస్తాన్‎కు చెందిన ఎన్ని జెట్‌లను కూల్చివేశారో ఎప్పుడు అడగలేదని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్‌ సక్సెస్ సందర్భంగా ప్రధాని మోడీని కూడా ఆయన అభినందించలేదన్నారు.  

అసలు రాహుల్ ఏమన్నారంటే..?

ఆపరేషన్​సిందూర్ గురించి పాకిస్తాన్‎కు ముందే సమాచారం ఇవ్వడం వల్ల భారత్​ ఎన్ని విమానాలు కోల్పోయిందో జైశంకర్​ చెప్పడం లేదన్నారు. ఆయన మౌనం వహించడం తీవ్రమైనదే కాదు.. అది నేరమని పేర్కొన్నారు. సోమవారం రాహుల్​గాంధీ ‘ఎక్స్’​ వేదికగా జైశంకర్‎పై విరుచుకుపడ్డారు. దేశానికి నిజం తెలియాలనే తాను పదే పదే ఈ ప్రశ్న అడుగుతున్నానని రాహుల్ ​అన్నారు

అయినా జైశంకర్​ నుంచి ఎలాంటి సమాధానం రావడంలేదని అసహనం వ్యక్తంచేశారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభానికి ముందే ఉగ్రవాద లాంచ్‌‌ ప్యాడ్‌‌లపై దాడి చేస్తున్నామని, పాక్‌‌ సైన్యం వాటికి దూరంగా ఉండాలని భారత్‌‌ చెప్పినట్లు జైశంకర్‌‌ పేర్కొన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అలా చేయడం వల్ల పాకిస్తాన్​అప్రమత్తమైందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి జైశంకర్​ మాట్లాడిన ఓ వీడియోను రాహుల్​ రీపోస్ట్​ చేశారు.