పార్లమెంట్ స్తంభనకు మోడీ, షాలే కారణం.. సభకు వచ్చేందుకు భయపడుతున్నరు: ఖర్గే

పార్లమెంట్ స్తంభనకు మోడీ, షాలే కారణం.. సభకు వచ్చేందుకు భయపడుతున్నరు: ఖర్గే

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగకపోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలే కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. విద్యార్థులపై జరుగుతున్న అణచివేతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ఎందుకు ప్రకటన చేయడం లేదని ప్రశ్నించారు. స్టూడెంట్ల అంశంపై తాము చర్చించాలని కోరుతుంటే మోదీ, షా గత 17 రోజులుగా సభకు రాకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. 

ఉభయ సభలు స్తంభించిపోవడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. సోమవారం ఆయన పార్లమెంట్ కాంప్లెక్స్​లో మీడియాతో మాట్లాడారు. సభలో చర్చకు రావడానికి ప్రధాని, హోంమంత్రి షా భయపడుతున్నారని ఖర్గే విమర్శించారు. విద్యార్థుల అంశంపై తాము కేవలం ఒక ప్రకటన మాత్రమే అడుగుతున్నామని, ప్రభుత్వం ఎందుకు చేయడంలేదని నిలదీశారు.

సభలో సమాధానం చెప్పలేక, ప్రజల సమస్యలను పరిష్కరించలేక మోదీ, షాలు ఇంటి నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు సభలో లేచి మాట్లాడేటప్పుడు గందరగోళం సృష్టించాలని అధికార పార్టీ సభ్యులకు ఆదేశాలు ఇస్తున్నారని మండిపడ్డారు. 

రాజ్యసభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్

రామమందిర విరాళాల దుర్వినియోగం,పేపర్ లీక్ ఘటనపై నిరసన తెలిపిన స్టూడెంట్లపై పెల్లెట్ గన్ల ప్రయోగం వంటి అంశాలపై మాట్లాడేందుకు రాజ్యసభలో చైర్మన్ అనుమతి ఇవ్వలేదు. దాంతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో పాటు టీఎంసీ సభ్యుడు నదిముల్ హక్ ఇతర ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ప్రయత్నించగా, కేవలం బ్యాంకర్స్ బిల్లు గురించే మాట్లాడాలని చైర్ స్పష్టం చేసింది. ఈ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష 
పార్టీలన్నీ రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి.