ఎన్నికలొస్తున్నయ్ కాబట్టే.. మోడీ రామజపం చేస్తున్నారు:మల్లికార్జున్ ఖర్గే

 ఎన్నికలొస్తున్నయ్ కాబట్టే.. మోడీ రామజపం చేస్తున్నారు:మల్లికార్జున్ ఖర్గే

మణిపూర్ ను కాంగ్రెస్ ప్రధానులంతా సందర్శించారని.. కానీ, ప్రధాని మోడీ మణిపూర్ ను ఎందుకు సందర్శించలేదని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. ఇప్పుడు దేశంలో ఎన్నికలొస్తున్నాయి కాబట్టే.. మోడీ ఇప్పుడు రామజపం పాటిస్తున్నారని విమర్శించారు. జనవరి 14 వ తేదీ ఆదివారం మణిపూర్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమయ్యింది.  AICC చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్  జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు.  అనంతరం ఏర్పాటు చేసిన సభలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు.

 సామాజిక, రాజకీయం, రాజ్యంగం పరిరక్షణ కోసం మా పోరాటం జరుగుతుందన్నారు ఖర్గే. దేశంలో ద్రవ్యొల్బణం భారీగా పెరిగిపోయిందని...  పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 146మంది ఎంపీలను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేశారని... దేశ చరిత్రలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో యువతకు ఉద్యోగాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.  దేశంలో పేద ప్రజలను ఆదకుంంది కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు. పేద ప్రజలు, రైతులు, యువత కోసం ఈ న్యాయ్ యాత్ర జరుగుతుందని చెప్పారు. ఈ యాత్రతో దేశాన్ని ఏకం చేస్తామని ఖర్గే చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ  ముఖ్య నేతలు, కాంగ్రెస్  సీఎంలు, వివిధ రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.