మేం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలుసు : ఖర్గే

మేం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలుసు : ఖర్గే

బెరాసియా(మధ్యప్రదేశ్): కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద డ్యామ్​లు నిర్మించిందని.. గ్రీన్, వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చిందని, అన్ని రంగాలను ఎంతో అభివృద్ధి చేసిందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్ చేసిన డెవలప్​మెంట్ దేశ ప్రజలకు తెలుసు అని చెప్పారు. దేశాభివృద్ధి కోసం ఒక విజన్​తో ముందుకు వెళ్లిందని తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో ఇంజనీరింగ్, మెడికల్ ఇన్​స్టిట్యూట్స్​ను ఏర్పాటు చేసిందని వివరించారు. 

స్వాతంత్ర్యం వచ్చాక 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. దేశానికి ఏం చేసిందన్న ప్రధాని నరేంద్ర మోదీ కామెంట్లపై మల్లికార్జున ఖర్గే స్పందించారు. భోపాల్ జిల్లా బెరాసియాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగ పరిరక్షణ జరిగింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించాం. ఆహార ధాన్యాల సాగు పెంచేందుకు హరిత విప్లవం తీసుకొచ్చాం. పాల ఉత్పత్తి పెంచేందుకు శ్వేత విప్లవం తీసుకొచ్చాం. భాక్రానంగల్ వంటి పెద్ద పెద్ద డ్యామ్​లు కట్టాం. ప్రపంచ స్థాయి, అత్యాధునిక సౌకర్యాలతో విద్య, వైద్య వ్యవస్థను స్థాపించాం” అని ఖర్గే అన్నారు.

దేశ ప్రధాని చిన్న గ్రామంలో ఎన్నికల ప్రచారమా..?

కాంగ్రెస్ హయాంలో స్థాపించిన ఎయిమ్స్, ఐఐటీలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఆలయాలు.. మోడ్రన్ ఇండియాకు నిదర్శనమని ఖర్గే అన్నారు. ‘‘దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ.. చిన్న చిన్న గ్రామాలు, పట్టణాల్లో నిర్వహించే ఎన్నికల ర్యాలీల్లో స్పీచ్​లు ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. వీధుల్లో తిరగకుండా.. ప్రధాని బాధ్యతలు 
సక్రమంగా నిర్వర్తించండి” అని ఖర్గే హితవు పలికారు.