మోదీ గెలిస్తే.. మరో పుతిన్.. మళ్లీ ఎన్నికలు ఉండవు : ఖర్గే

మోదీ గెలిస్తే.. మరో పుతిన్.. మళ్లీ ఎన్నికలు ఉండవు : ఖర్గే

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీ మళ్లీ గెలిస్తే.. దేశానికి ఇవే చివరి ఎన్నికలు అవుతాయని.. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండి.. మేల్కోవాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే. బీజేపీ గెలిచినా.. మోదీ మళ్లీ ప్రధానమంత్రి అయినా.. దేశంలో మళ్లీ ఎన్నికలు జరగవు అని.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తరహాలో జీవితాంతం ఆయనే ప్రధానిగా.. సుప్రీంగా ఉండే విధంగా రాజ్యాంగాన్ని మార్చేస్తాడని హెచ్చరించారు ఖర్గే.

భారతదేశంలో ప్రజాస్వామ్యానికి 2024 ఎన్నికలు చివరివి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. ప్రతి ఒక్కరికీ ఈడీ, సీబీఐ నోటీసులు వస్తున్నాయని.. దీంతో భయపడి కొందరు స్నేహాన్ని వీడుతున్నారు.. మరికొందరు దూరం అవుతున్నారు.. ఇంకొందరు దోస్తీ కడుతున్నారంటూ బీహార్ రాజకీయాలను ప్రస్తావిస్తూ కామెంట్స్ చేశారు ఖర్గే. 

బీజేపీతోపాటు ఆ పార్టీ సైద్దాంతిక గురువు ఆర్ఎస్ఎస్ దేశ ప్రజల్లో విషం నింపుతుందని.. సమైక్యత దెబ్బతీస్తుందని.. తప్పుడు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళుతుందని.. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారాయన. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో పర్యటించిన మల్లిఖార్జున ఖర్గే.. ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో మోదీ గెలిచినట్లయితే.. ఆ తర్వాత నియంతృత్వం వస్తుందని.. భారతదేశానికి ఇంది ఎంత మాత్రం మంచిది కాదన్నారాయన. దేశంలో సమ న్యాయం, సమానత్వం, అందరికీ ఒకే న్యాయం, దేశ ప్రజలకు ఐక్యత చేయటానికి రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని స్పష్టం చేశారు ఖర్గే. 

మల్లిఖార్జున ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఒకే దేశం.. ఒకే ఎన్నికల వైపుగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..