ఫామ్​హౌస్​ సీఎం మనకెందుకు? .. ప్రజలు గోసపడ్తున్నా కేసీఆర్​కు పట్టదు: మల్లికార్జున ఖర్గే

ఫామ్​హౌస్​ సీఎం  మనకెందుకు? .. ప్రజలు గోసపడ్తున్నా కేసీఆర్​కు పట్టదు: మల్లికార్జున ఖర్గే
  • బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కుట్రలు చేస్తున్నయ్​
  • అయినా కాంగ్రెస్​ గెలుపును ఎవరూ ఆపలేరు
  • ఐటీ, ఈడీ దాడులకు భయపడేది లేదు.. లడాయి చేసుడే
  • ల్యాండ్, సాండ్​, మైన్, వైన్‌‌ స్కాముల్లో బీఆర్​ఎస్​
  • అన్ని స్కాముల్లో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు భాగస్వాములే
  • ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిండు.. జనంపై భారం మోపిండు
  • నల్గొండ, అయిజ సభల్లో ఏఐసీసీ​ చీఫ్​ వ్యాఖ్యలు

ప్రజలను కలువకుండా ఫామ్ హౌస్​లో ఉండే ముఖ్యమంత్రి అవసరమా? అని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. జనం కష్టాలు పడుతున్నా కేసీఆర్​కు పట్టదని, ఎప్పుడైనా ఆయన ప్రజల్లో తిరిగుంటే జనం కష్టాలు ఏమిటో తెలిసేవని అన్నారు. కాంగ్రెస్​ను గెలిపిస్తే పేదల ప్రభుత్వం వస్తుందని, ఆరు గ్యారంటీలతో పాటు ప్రతి హామీని అమలు చేస్తామని ఖర్గే చెప్పారు. బుధవారం నల్గొండలో, జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఖర్గే మాట్లాడారు. ‘‘బీజేపీకి బీఆర్ఎస్, ఎంఐఎం ఏ టీమ్, బీ టీమ్​లుగా పని చేస్తున్నయ్​. కేసీఆర్  నాగ్​పూర్​లో ఆర్ఎస్ఎస్  హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి.. మోదీ తన దోస్త్  అని చెప్తడు. అదే కేసీఆర్​ మళ్లీ హైదరాబాద్ కు వచ్చి.. ఎంఐఎం వాళ్లు తన మిత్రులు అంటడు. ఆ మూడు పార్టీలు కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పై కుట్రలు చేస్తున్నయ్​. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్​ గెలవడం ఖాయం” అని అన్నారు. కాంగ్రెస్​ను భయపెట్టేందుకు అటు దేశంలో, ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఐటీ, ఈడీ రెయిడ్స్​, ఆస్తుల జప్తులు చేయిస్తున్నారని, కానీ ఈ దాడులకు కాంగ్రెస్​ భయపడబోదని, పేదల కోసం లడాయి చేస్తుందని చెప్పారు.  ‘‘బ్రిటిష్ వాళ్లకే భయపడని పార్టీ కాంగ్రెస్​. అలాంటిది బీజేపీకి ఎట్ల భయపడ్తది?” అని ప్రశ్నించారు. ప్రజలంతా కాంగ్రెస్​ వైపు ఉండటంతో ఓర్వలేక బీజేపీ, బీఆర్​ఎస్​, ఎంఐఎం కుట్రలు పన్నుతున్నాయని.. ఆ మూడు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు.

బీఆర్​ఎస్​ పాలన.. కుంభకోణాల మయం

బీఆర్‌‌ఎస్‌‌ పాలన అంతా ల్యాండ్, సాండ్​, మైన్, వైన్‌‌ కుంభకోణాల మయంగా మారిందని, దాంట్లో సీఎం కేసీఆర్‌‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు భాగస్వాములే అని ఖర్గే మండిపడ్డారు. ‘‘కేసీఆర్‌‌ లాంటి అహంకారిని గద్దె దింపేందుకు ప్రజలు ఏకం కావాల్సిన అవసరముంది. ఢిల్లీలో మోదీ, హైదరాబాద్‌‌లో ఫాంహౌస్​లో ఉండే కేసీఆర్‌‌.. ఇద్దరూ ఒక్కటే. నిరుపేదలు కష్టాలు పడుతున్న ప్రధానికి, సీఎంకు పట్టవు. రాహుల్‌‌ గాంధీ జోడో యాత్ర ద్వారా కశ్మీర్‌‌ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశారు. మోదీ, కేసీఆర్‌‌ 500 కి.మీ. నడిచి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి” అని సవాల్​ చేశారు. కేసీఆర్​ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణ ఇచ్చిన గాంధీ కుటుంబంపైన కేసీఆర్​ ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘సోనియా, రాహుల్, ప్రియాంక ఏనాడూ ప్రధాని పదవి కాదు కదా, మంత్రి పదవి కూడా ఆశించలేదు” అని అన్నారు.  ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా కేసీఆర్​ మార్చారని, రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేశారని, రాష్ట్రంలో ఒక్కొక్కరిపై 1.40 లక్షల అప్పు చేసిన ఘనత కేసీఆర్‌‌కే దక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALSO READ : కేసీఆర్.. ​లెక్కపెట్టుకో 80 సీట్లు గెలుస్తం : రేవంత్

అన్నీ స్కీంలు బంద్​ పెట్టిండు

రాష్ట్రంలో అన్ని స్కీంలను కేసీఆర్ బంద్​ పెట్టారని ఖర్గే అన్నారు. ‘‘విద్యార్థుల ఫీజు రీయింబర్స్​మెంట్,  రైతుల రుణ మాఫీ, దళిత బంధు, గృహలక్ష్మి పథకాలకు డబ్బులు విడుదల కావడం లేదు. రాష్ట్రంలో 2 లక్షల ఉ ద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలో ఫెయిలయ్యారు. ఉద్యోగ నియామక పరీక్షలు పెడితే పేపర్‌‌ లీక్‌‌ కావడం కేసీఆర్‌‌ పాలన దుస్థితికి అద్దం పడ్తున్నది. చివరికి ఎస్సీ, ఎస్టీ సబ్‌‌ప్లాన్‌‌ నిధులను కూడా దారిమళ్లించిండు” అని ఆరోపించారు. 

పేదలను ఆదుకోవడమే కాంగ్రెస్​ ప్రభుత్వ విధానం

నల్గొండ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందని ఖర్గే అన్నారు. ఫ్లోరోసిస్​ మహమ్మారి మీద పోరాడి చనిపోయిన అంశలస్వామికి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ‘‘దేశంలో గొప్ప ప్రాజెక్టు నాగార్జునసాగర్‌‌ను నల్గొండ జిల్లాలో కట్టారు. ఆ నీటిని మొదట ఇందిరాగాంధీ విడుదల చేశారు. దాంతో రైస్‌‌బోల్‌‌గా ఈ ప్రాంతం మారింది. పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన చరిత్ర కాంగ్రెస్​ది. అందుకే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యమంటే రైతులకు సాగునీరు అందించడం, పంటలు పండించడం, పండిన పంటకు ధరలు ఇప్పిం చడం” అని ఆయన అన్నారు. తెలంగాణలో మెదక్, యూపీలో రాయబరేలి నుంచి ఆ నాడు పోటీ చేసి గెలిచిన ఇందిరా గాంధీ.. తెలంగాణ మీదున్న ప్రేమతో రాయబరేలి సీటును వదులుకున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్​ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ‘‘జవహర్ లాల్ నెహ్రూ స్థాపించిన మూడు పత్రికలు, వాటికి సంబంధించిన రూ.780 కోట్ల ఆస్తులను ఇటీవల జప్తు చేశారు.. అవి వ్యక్తులకు సంబంధించినవి కాదు.. స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను, యువకులను చైతన్యం చేసేందుకు పెట్టినవి..  నేషనల్ హెరాల్డ్​తో పాటు మరో రెండు పత్రికలను జప్తు చేయడం దుర్మార్గం’’ అని అన్నారు. పేద ప్రజల కోసం ఇందిరా గాంధీ, రాజీవ్​ గాంధీ, సోనియా గాంధీ అడుగుజాడల్లో కాంగ్రెస్  పార్టీ  ముందుకు సాగుతున్నదని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 

420 కేసీఆర్​తో బీజేపీ చేతులు కలిపింది: విజయశాంతి 

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల మీద దండయాత్ర జరిగిందని, మళ్లీ కేసీఆర్ ​గెలిస్తే తెలంగాణ ఇంకింత ఆగమవుతుందని కాంగ్రెస్  పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. అయిజ సభలో ఆమె మాట్లాడుతూ.. ‘‘బీజేపీ, బీఆర్ఎస్  ఒకటే. 420 కేసీఆర్​తో బీజేపీ చేతులు కలిపింది. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్​ను గద్దె మీద కూర్చోబెట్టాలని బీజేపీ చూస్తున్నది” అని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లు గెలుస్తుందని, బీఆర్ఎస్​కు 20 సీట్లు కూడా రావని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ​సభల్లో మాణిక్ రావు ఠాక్రే, ఉత్తమ్​కుమార్​రెడ్డి, మల్లు రవి, చిన్నారెడ్డి, మంద జగన్నాథం, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.