
- బీజేపీ పరిస్థితి దిగజారింది
- మోదీ, షా పూర్వీకులే అప్పట్లోముస్లిం లీగ్‌కు సపోర్ట్ చేసిన్రు
- పదేండ్ల అన్యాయాన్ని పారదోలేందుకు సమష్టి కృషి
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో 180 సీట్లు కూడా రావని ప్రధాని మోదీకి భయం పట్టుకున్నదని కాంగ్రెస్ విమర్శించింది. అందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి అది ముస్లిం లీగ్ స్క్రిప్ట్లా ఉందంటూ గిలాగిలా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేసింది. బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటంతో ఆర్ఎస్ఎస్ తన పాత మిత్రుడైన ముస్లిం లీగ్‌ను గుర్తు చేసుకుంటున్నదని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే చురకలంటించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ముస్లింలీగ్ ముద్ర ఉన్నదని, కాంగ్రెస్ నాయకుల మాటలు జాతీయ సమగ్రత, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆదివారం నిర్వహించిన ర్యాలీలో మోదీ చేసిన విమర్శలకు సోమవారం ఖర్గే ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. స్వాతంత్రోద్యమ కాలంలో మోదీ, అమిత్ షా పూర్వీకులు (ఆర్ఎస్ఎస్ నేతలు) భారతీయులకు వ్యతిరేకంగా బ్రిటీష్, ముస్లిం లీగ్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేతృత్వంలో గాంధీ పిలుపునిచ్చిన 1942 క్విట్ ఇండియా ఉద్యమాన్ని కూడా మోదీ, అమిత్ షా పూర్వీకులు వ్యతిరేకించారని ఖర్గే గుర్తు చేశారు. నేటికీ వారు సాధారణ భారతీయ పౌరుల సహకారంతో రూపొందించిన ‘కాంగ్రెస్ న్యాయ పత్రం’కు వ్యతిరేకంగా ముస్లిం లీగ్‌ను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు.
ముస్లిం లీగ్, బీజేపీ ప్రభుత్వం..
1940లో మోదీ, షా పూర్వీకులు బెంగాల్, సింధ్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ (ఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ)లో ముస్లింలీగ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అందరికీ తెలుసని ఖర్గే అన్నారు. మోదీ, అమిత్ షా, వారి నామినేటెడ్ అధ్యక్షుడు కాంగ్రెస్ మేనిఫెస్టోపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ ప్రసంగాలు ఆర్ఎస్ఎస్ ఎజెండాను దెబ్బతీస్తున్నాయని అన్నారు. ‘కాంగ్రెస్ న్యాయ పత్రం’ దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందనేది ఒక్కటే నిజమని నొక్కిచెప్పారు. తమ పార్టీ సమష్టి బలంతో పదేండ్ల
మోదీ అన్యాయాలకు తెరదించుతామని ఖర్గే చెప్పారు.
ప్రాబల్యం కోల్పోతుండటంతో..: సుప్రియా
బీజేపీ ప్రాబల్యం కోల్పోతుండటంతో ఆ పార్టీ నేతలు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనటే విమర్శించారు. అందుకే ప్రధాని మోదీకి ముస్లింలీగ్‌పై ప్రేమ మళ్లీ పుంజుకున్నదని చురకలంటించారు. సోమవారం ఆమె ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని, ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన బ్లూప్రింట్ అని ఆమె పేర్కొన్నారు.
ఈ పదేండ్లలో ప్రధాని మోదీ దేశం కోసం ఏమీ చేయలేదని, అందుకే ఎన్నికల సమయంలో మరోసారి హిందూ ముస్లిం స్క్రిప్ట్‌ను ఆశ్రయించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్నాటకలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నట్టు తెలిపారు. మోదీజీ.. మా గ్యారంటీ అనే పదాన్ని మీరు దొంగిలించినా.. మీ మాట ఎవరూ వినరు. మీ జుమ్లాల (అబద్ధాలు)పై ప్రజలు నివేదిక కోరుతున్నారు. ఇక మీరు బ్యాగులు ప్యాక్ చేసుకొని ఇంటికెళ్లేందుకు రెడీగా ఉండండి’ అని చురకలంటించారు.