తగ్గిన మల్లు భట్టి షుగర్ లెవల్స్ : నేతల పరామర్శ

తగ్గిన మల్లు భట్టి షుగర్ లెవల్స్ : నేతల పరామర్శ

హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర ధర్నాచౌక్ వేదికగా.. ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష కొనసాగిస్తున్నారు ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క. నిరసన దీక్షను ఆమరణ దీక్షగా మార్చి.. తన నిరసన కొనసాగిస్తున్నారాయన. ఏఐసీసీ నేతలు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్కను పరామర్శిస్తున్నారు.

భట్టికి ఈ సాయంత్రం వైద్యపరీక్షలు చేశారు డాక్టర్లు. కొద్దిగా షుగర్ లెవల్స్ తగ్గినట్టు చెప్పారు.

ఉదయం వేళ దీక్షా వేదికకు వచ్చి భట్టిని పరామర్శించారు ఏఐసీసీ సెక్రటరీ సలీమ్ అహ్మద్. కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలను గ్రామగ్రామానికి తీసుకెళ్తామన్నారు.

ఇది నేషనల్ కాంగ్రెస్ పోరాటం

భట్టిని పరామర్శించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర.. అధికారం శాశ్వతం కాదని కవిత ఓడిపోయినప్పుడైనా కేసీఆర్ అర్థం కావాల్సింది అన్నారు. సోనియా ఇచ్చిన తెలంగాణలో రూ.30కోట్లు ఇచ్చి ఒక్కో ఎమ్మెల్యేను కొంటున్నారని అన్నారు. ఇది తెలంగాణ కాంగ్రెస్ పోరాటం మాత్రమే కాదు.. నేషనల్ కాంగ్రెస్ పోరాటం అన్నారు పరమేశ్వర.

ఓ దళితున్ని, భట్టిని ఎదుర్కొనే సత్తా సీఎంకు లేదన్నారు అద్దంకి దయాకర్.

భట్టి ఆమరణ నిరాహార దీక్షకు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతిచ్చారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్, వంశీచంద్ రెడ్డి, ఇతర నేతలు మద్దతు ఇచ్చారు.