గజ్వేల్లో ఓడిపోతామనే భయంతో కేసీఆర్ కామారెడ్డికి పోతున్నారు : మల్లు భట్టి విక్రమార్క

 గజ్వేల్లో ఓడిపోతామనే భయంతో కేసీఆర్ కామారెడ్డికి పోతున్నారు : మల్లు భట్టి విక్రమార్క

బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటనపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. బీఆర్ఎస్  నేతలు పార్టీలు మారుతారనే ఆందోళనతోనే కేసీఆర్ అభ్యర్థులను ముందుగానే ప్రకటించారని తెలిపారు. గజ్వేల్ లో ఓడిపోతారని వచ్చిన సర్వే ఫలితాల భయంతోనే కేసీఆర్ కామారెడ్డికి పోతున్నారని చెప్పారు. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడంతోనే బీఆర్ఎస్ ఓడిపోతుందనేది అర్థం అవుతోందన్నారు. కేసీఆర్ కే దిక్కులేకనే కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారని చెప్పారు. అలాంటి కేసీఆర్ బొమ్మతో మిగితావాళ్లు ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్ పాలనతో నష్టపోయిన వారందరూ కాంగ్రెస్ తో కలిసి రావాలని పిలుపునిచ్చారు మల్లు భట్టి విక్రమార్క. తాము సరైన సమయంలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి, మార్చి నుంచే తాము ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిసి తాను చేపట్టిన పాదయాత్ర విశేషాలు, తెలంగాణ రాష్ట్రంలోని సమస్యల గురించి వివరించానన్నారు. 

50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదంటూ కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు భట్టి. సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్ మెంట్ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల ముందు నిలబడి సెల్ఫీలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా ప్రజల ముందుకు వెళ్తామన్నారు.