- కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మల్లు రవి ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలపై నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబంపై అమిత్ షా చేసిన విమర్శలను తిప్పికొట్టారు. కమ్యూనిస్టు పార్టీలకు, నిషేధిత మావోయిస్టు ఉద్యమానికి మధ్య ఉన్న వ్యత్యాసం అమిత్ షాకు తెలియదా అని ప్రశ్నించారు.
సీపీఐ, సీపీఎం రాజ్యాంగబద్ధంగా గుర్తించబడిన పార్టీలని, వాటితో పొత్తును మావోయిస్టులతో ముడిపెట్టడం అజ్ఞానమని విమర్శించారు. గతంలో జనతా పార్టీ కూటమిలో సీపీఐ, సీపీఎంతో కలిసి జన్‌సంఘ్ (నేటి బీజేపీ) పనిచేసిన చరిత్రను అమిత్ షా ఎందుకు విస్మరించారని నిలదీశారు.
బీజేపీ చేస్తే ఒప్పయ్యేది, కాంగ్రెస్ చేస్తే తప్పెలా అవుతుందన్నారు. ప్రజాకవి గద్దర్ పూర్తిస్థాయి ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాతే రాహుల్ గాంధీ ఆయనను కలిశారని, దీనిని రాజకీయం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ బుల్లెట్‌ను నమ్మలేదని, కేవలం బ్యాలెట్ (ప్రజాస్వామ్యం) ద్వారానే ముందుకు సాగుతున్నదని స్పష్టం చేశారు. రాజ్యసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను మల్లు రవి తప్పుబట్టారు. గతంలో మోదీ, అమిత్ షాలు కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎంలా మారిందని విమర్శించారని గుర్తుచేశారు. బీజేపీ నేతలు విమర్శలకే పరిమితమయ్యారని, అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
