కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందుత్వం: మల్లు రవి

కాంగ్రెస్ డీఎన్ఏలోనే  హిందుత్వం: మల్లు రవి

హైదరాబాద్: కాంగ్రెస్ డీఎన్ఏ లోనే  హిందుత్వం ఉందని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. సిటీలోని గాంధీ భవన్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీవ్ గాంధీ హయాంలోనే అయోధ్య లో రామాలయానికి ఫౌండేషన్ వేశారని తెలిపారు.  కొందరు కోర్టులో కేసు వేయడంతో నిర్మాణం ఆగిందన్నారు.  దేశంలో హిందువుల సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారని,  అయితే ఆనాడు  హిందువుల కోసమే కాంగ్రెస్ నేతలు స్వాతంత్ర పోరాటం  చేశారని ఆయన చెప్పారు. మతం పేరుతో కిషన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సెక్యులరిజం అంటే అన్ని మతాలను ప్రేమించాలని, ఒకే మతాన్ని కాదని ఆయన హితవు పలికారు.

బీజేపీ వాళ్లే రామయాన్ని రాసినట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తలంబ్రాల పంపిణీ పేరుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాహుల్​ యాత్రపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మాటలను ఆయన ఖండించారు. రాహుల్ చేపట్టే న్యాయ్ యాత్రపై కామెంట్స్​ సహించబోమన్నారు. రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసం రాహుల్  యాత్ర చేస్తున్నారని తెలిపారు.  

చేసిన అభివృద్ధిపై  ప్రచారం  చేసుకోకపోవడంతోనే  ఓడిపోయామని కేటీఆర్అనడం సిగ్గుచేటన్నారు. అసలు ప్రజలను పట్టించుకోకుండా ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆయన మండిపడ్డారు.చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్లు  తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు.