పరిహారం ఇవ్వకుంటే ధర్నాకు పిలుపునిస్తాం: మల్లు రవి

పరిహారం ఇవ్వకుంటే ధర్నాకు పిలుపునిస్తాం: మల్లు రవి

కేసీఆర్ దళితుల వ్యతిరేకి అని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ మల్లురవి అన్నారు.  పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి కేసీఆర్ దళితుల మనోభావాలను దెబ్బతీశారని ఆయన అన్నారు. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు  విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నించగా.. ఆయనతో పాటు మరో 60 మందిని పోలీసులు ఆరెస్ట్ చేయడాన్ని మల్లు రవి ఖండించారు.

రాత్రిపూట రాజ్యాంగ నేత విగ్రహాన్ని తీసివేసి చెత్త కుప్పలో వేయడం దారుణమన్న మల్లురవి.. ఈ ఘటనపై గవర్నర్ ను కలిశామని, అఖిల పక్ష భేటీ కూడా జరిగిందని.. కానీ ఇంతవరకు ఆ విగ్రహ తొలగింపుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడని మాట తప్పిన కేసీఆర్, తరువాత  దళితుణ్ని ఉప ముఖ్యమంత్రిని చేసి కారణం లేకుండా తొలగించారన్నారు.  మొదటి నుంచి కూడా కేసీఆర్ వ్యవహారం దళితులకు వ్యతిరేకంగా ఉందన్నారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంపై మాట్లాడిన మల్లు రవి..  మల్లన్న సాగర్ విషయంలో ఏ రకంగా రైతులకు పరిహారం ఇచ్చారో…అదేవిదంగా ఒట్టేమ్ ప్రాంత ప్రజలకు కూడా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  తమకు పరిహారం ఇవ్వాలని దీక్ష చేస్తున్నవారిపై ప్రభుత్వం పోలీసుల చేత దాడి చేయించడం దారుణమన్నారు.   పాలమూరు రంగారెడ్డి  భూనిర్వాసితులకు పరిహారం విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, లేదంటే చలో హైద్రాబాద్ పేరిట కాంగ్రెస్ పార్టీ  ధర్నాకు పిలుపునిస్తుందని మల్లు రవి అన్నారు