సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి

సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (91) అనారోగ్యంతో కన్నుమూశారు.  ఊపిరితిత్తుల సమస్యతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె శనివారం సాయంత్రం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. స్వరాజ్యం 10 ఏండ్ల వయసులోనే మల్లు వెంకట నరసింహారెడ్డిని వివాహం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో 1931లో జన్మించిన మల్లు స్వరాజ్యం.. నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి, రజాకార్ల పాలిటి సింహస్వప్నమై నిలిచింది. 1945 నుంచి 1948 సంవత్సరాల్లో సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించి నిజాం సర్కారును గడగడలాడించింది. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులను మేల్కొలడంలో మల్లు స్వరాజ్యం కీలక పాత్ర పోషించింది. నా మాటే తుపాకీ తూటా పేరుతో ఆత్మకథలు రాశారు.

స్వరాజ్యం జానపద బాణీల్లో పాటలు కట్టి స్వయంగా పాడి గ్రామాలలోని ప్రజలను ఆకట్టుకునేది. స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1978-1983, 1983-1984 సంవత్సరాలలో రెండు పర్యాయాలు సి.పి.ఐ.(ఎం) పార్టీ తరఫున ఎన్నికైంది. నల్లగొండకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణా యోధుడు, పార్లమెంటేరియన్ భీమిరెడ్డి నరసింహారెడ్డికి సోదరి కావడం గమనార్హం. వామపక్ష భావాలతో, స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక ‘చైతన్య మానవి’ సంపాదకవర్గంలో స్వరాజ్యం కూడా ఒకరు.

మల్లు స్వరాజ్యం జీవిత విశేషాలు
మల్లు స్వరాజ్యం చిన్నప్పటి నుంచి వామపక్ష భావాజాలంతో పెరిగింది. దాంతో ఆమె మార్క్సిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితురాలైంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు. వీరిది భూస్వామ్య కుటుంబం. వీరికి వందలాది ఎకరాల భూమి ఉండేది.  1945 సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో స్వరాజ్యం.. నిజాం సర్కారును గడగడలాడించారు. ఈమె పోరాటాల ధాటికి తట్టుకోలేక 1948లో స్వరాజ్యం ఇంటిని నిజాం గూండాలు దగ్ధం చేశారు. మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో భాగంగా.. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని నిరసిస్తు జనాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు.
 
స్వరాజ్యం దళంలో మహిళ కమాండర్‎గా పని చేశారు. అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యాన్ని పట్టిస్తే పదివేల రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. స్వరాజ్యం భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. స్వరాజ్యం సోదరుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి.. మిర్యాలగూడ పార్లమెంటు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. స్వరాజ్యం నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978 నుండి 83 వరకు మొదటి దఫా, 1983 నుండి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. మల్లు స్వరాజ్యానికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కూతురు పాదూరి కరుణ, పెద్ద కుమారుడు మల్లు గౌతమ్ రెడ్డి, చిన్న కుమారుడు మల్లు నాగార్జున రెడ్డి. నాగార్జున రెడ్డి భార్య మల్లు లక్ష్మి గత పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మల్లు గౌతంరెడ్డి సీపీఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా పని చేస్తున్నారు. చిన్న కుమారుడు మల్లు నాగార్జున్ రెడ్డి సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు. కూతురు పాదూరి కరుణ.. బీజేపీలో కొనసాగుతున్నారు.

For More News..

నెలలో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం

ఆర్ఆర్ఆర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‎న్యూస్

 జనసేనతో కలిసి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం