రాత్రిపూట ఆడపిల్లలను బయటకు పంపొద్దు: దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ కేసుపై CM మమతా షాకింగ్ కామెంట్స్

రాత్రిపూట ఆడపిల్లలను బయటకు పంపొద్దు: దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ కేసుపై CM మమతా షాకింగ్ కామెంట్స్

కోల్‎కతా: దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై టీఎంసీ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం (అక్టోబర్ 12) ఈ ఘటనపై దీదీ మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన అని.. ఇలాంటి నేరాలను ఎంతమాత్రం సహించమని అన్నారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారని.. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారని తెలిపారు. 

ఈ ఘటనలో ప్రమేయం ఉన్నా ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అయితే.. ఈ ఘటన ఒక ప్రైవేట్ వైద్య కళాశాలలో జరిగినందున తమ ప్రభుత్వాన్ని నిందించడం అన్యాయమని షాకింగ్ కామెంట్స్ చేశారు. కళాశాల అధికారులు బాధితురాలికి భద్రత కల్పించి ఉండాల్సిందని దీదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాత్రిపూట ఆడపిల్లలను బయటకు వెళ్లనివ్వకూడదని అన్నారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీఎం స్థాయిలో ఉండి నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించాల్సిందిపోయి.. యువతులు రాత్రి వేళ బయటకు వెళ్లొద్దని వాళ్లను  బయపెట్టే ధోరణిలో మాట్లాడటమేంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్, మహిళలు భద్రతలో మమతా బెనర్జీ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని.. ఇటీవల బెంగాల్‎లో మహిళలపై వరుసగా జరుగుతోన్న ఆఘాయిత్యాలకే ఇందుకు నిదర్శనమని విమర్శిస్తున్నారు. తమ అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే కాలేజీ యాజమాన్యంపై మమతా బెనర్జీ అభాండాలు మోపుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. 

పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‎లోని శివపూర్ ఏరియాలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న 23 ఏండ్ల యువతి గ్యాంగ్​రేప్‎కు గురైన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి 8.30 గంటల టైమ్‎లో యువతి తన స్నేహితుడితో కలిసి పానీపూరి తినేందుకు కాలేజీ నుంచి బయటకు రాగా.. కొందరు వ్యక్తులు అమ్మాయిని కాలేజీ వెనుక ఉన్న అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.