కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10.45 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ జగదీప్ ధన్ కడ్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా మహమ్మారి సునామీలా విరుచుకుపడుతున్న నేపధ్యంలో మమతా బెనర్జీ నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం వేళ్ల మీద లెక్కించే రీతిలో అతికొద్ది మంది అతిధులకే ఆహ్వానం పంపారు. రాష్ట్రంలో ఏడు విడుతలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఒంటికాలితో సుడిగాలి పర్యటనలు చేసి క్లీన్ స్వీప్ సాధించిన విషయం తెలిసిందే. ఏడాది కాలంగా ప్రతిపక్షాలు ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ పార్టీ నేతలు బెంగాల్ పై దృష్టి సారించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలందర్నీ చీల్చి పార్టీని అడ్రస్ లేకుండా చేయడానికి విశ్వప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే.
సామ దాన భేద దండోపాలన్నీ ప్రయోగించినా.. చివరకు ఆమె ఎన్నికల ప్రచారంలో తిరగకుండా దాడి చేసి గాయపరచినా.. కుంటి కాలితో వీల్ చైర్ పై తిరుగుతూ.. కేంద్రంలోని బీజేపీని గట్టిగా ఎదిరించి నిలబడడమే కాదు.. సునామీలో భారీ మెజారిటీతో గెలవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు తనకు ఒకనాటి కుడి భుజం, ఈ ఎన్నికల్లో ప్రత్యర్థిగా బరిలోకి దిగిన సువేందు అధికారిని ఓడించేందుకు నందిగ్రామ్ నుండి పోటీ చేసిన మమత చివరి రౌండ్ లో 17 వందల పైచిలుకు మెజారిటీతో ఓడిపోవడం అంతే సంచలనం అయింది. ఎమ్మెల్యేగా గెలవకున్నా పార్టీని ఒంటిచేత్తో గెలిపించిన ఆమె తిరిగా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుండి ఆమె అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది.
ఒంటికాలితో బెంగాల్ ను జయించిన మమత
తాను దెబ్బతిన్న రాయల్ బెంగాల్ టైగర్‌నని చెప్పి మరీ ఒంటికాలతో బెంగాల్ ను జయించారు మమతా బెనర్జీ. ఎనిమిది విడుతలుగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో..... మమత నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ 213 స్థానాల్లో ఘన విజయం సాధించింది. నందిగ్రామ్ లో సవాల్ చేసి బరిలోకి దిగారు మమతా. తన మాజీ అనుచరుడైన సువేందు అధికారి తన ప్రత్యర్థిగా మారినప్పటికీ చెక్కు చెదరదని మనో ధైర్యంతో ఢీకొన్నారు. కార్యకర్తలు, ముఖ్య అనుచరులతో ఎలాంటి సంబంధాలు లేనిచోట.. మొత్తం ముఖ్యమైన వారినందరినీ సువేందు అధికారి వెంట తీసుకెళ్లినా మమతా బెనర్జీ వెనుకంజ వేయకుండా అమీతుమీ తేల్చుకుంటానంటూ నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగారు. నందిగ్రామ్ ప్రచారంలో మమత గాయపడ్డారు. నడవలేని పరిస్థితుల్లో వీల్ చైర్ కే పరిమితమయ్యారు. అయినా ప్రచారం ఆపలేదు. వీల్ చైర్ తోనే ప్రచారం సాగించారు. రోడ్ షోలు చేశారు. సభల్లో పాల్గొన్నారు. గాయపడ్డ పులి మరింత ప్రమాదకరమంటూ చెప్పుకున్నారు. తానూ రాయల్ బెంగాల్ టైగర్ అని చెప్పడమే కాదు.. పార్టీని ఒంటిచేత్తో గెలిపించి రియల్ బెంగాల్ టైగర్ అని రుజువు చేసుకున్నారు మమతా బెనర్జీ.
