‘ఇండియా’ కూటమికి మమత షాక్.. కాంగ్రెస్​తో పొత్తుండదని ప్రకటన

‘ఇండియా’ కూటమికి మమత షాక్.. కాంగ్రెస్​తో పొత్తుండదని ప్రకటన
  •     లోక్​సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తమన్న దీదీ
  •     సీట్ల పంపకం​ చర్చలు ఫెయిల్​
  •     ఎన్నికల తర్వాత మద్దతుపై ఆలోచిస్తమని వెల్లడి
  •     దీదీ బాటలోనే ఆమ్ ఆద్మీ పార్టీ
  •     పంజాబ్​లో అన్నిచోట్లా పోటీ

కోల్​కతా/చండీగఢ్: లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమికి బెంగాల్, పంజాబ్ సీఎంలు మమతా బెనర్జీ, భగవంత్ మాన్ షాక్ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తమని బుధవారం వేర్వేరుగా ప్రకటించారు. కాంగ్రెస్​తో ఎలాంటి సంబంధాలు ఉండబోవని స్పష్టం చేశారు. సీట్ల షేరింగ్ వ్యవహారం తేల్చడంలేదని ఇద్దరు సీఎంలు కాంగ్రెస్ వైఖరిపై మండిపడ్డారు. తమ డిమాండ్లను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇక కాంగ్రెస్​తో పొత్తులు ఉండవని.. అన్నీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఉదయమే కూటమి నుంచి బయటికొస్తున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించగా.. మధ్యాహ్నానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా లోక్​సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు.

రాహుల్ యాత్రపై ఇన్ఫర్మేషన్ లేదు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై కూడా తమకు సమాచారంలేదని మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్ మీదుగా యాత్ర కొనసాగనుందని, కనీసం టీఎంసీ లీడర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పారు. ‘‘సీట్ల షేరింగ్ విషయమై కాంగ్రెస్​తో మేము జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. మేము వారికి (కాంగ్రెస్) ఏ ప్రపోజల్ ఇచ్చినా.. వారు అన్నింటినీ తిరస్కరించారు. ఇక బెంగాల్​లో మాకు కాంగ్రెస్​తో ఎలాంటి సంబంధాల్లేవు. బెంగాల్​లో ఒంటరిగానే పోటీ చేస్తాం. ఎన్నికల తర్వాత కూటమికి మద్దతు ఇవ్వాలా..? వద్దా..? అనేది అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం. రాహుల్​ గాంధీ మా రాష్ట్రానికి వస్తున్నారు. అయినా మాకు ఎవరూ చెప్పలేదు. సమాచారం ఇచ్చే మర్యాద కూడా వారికి (కాంగ్రెస్) లేదు’’అని మమతా బెనర్జీ మండిపడ్డారు.

కాంగ్రెస్​కు రెండే సీట్లు ఇస్తామన్న టీఎంసీ!

‘‘దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సొంతంగా 300 సీట్లలో పోటీ చేయనివ్వండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రాంతీయ పార్టీలు మాత్రం కలిసి పోటీ చేస్తాయి. బెంగాల్ లో మాత్రం కాంగ్రెస్ జోక్యాన్ని మాత్రం మేం సహించం. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటమే మా ఎజెండా. ఇందులో ప్రాంతీయ పార్టీల లీడర్లే నాయకత్వం వహించాలి. టీఎంసీ మాత్రం ఎన్నికల తర్వాతే తన నిర్ణయం వెల్లడిస్తుంది. అపోజిషన్ ఫ్రంట్ అనేది ఏ ఒక్క పార్టీకి చెందినది కాదు’’ అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కాగా, 2019 లోక్​సభ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని బెంగాల్​లో కాంగ్రెస్​కు రెండు సీట్లు ఇస్తామని టీఎంసీ తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తున్నది.

పంజాబ్​లో క్లీన్ స్వీప్ చేస్తాం: భగవంత్ మాన్

పంజాబ్​లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ బుధవారం స్పష్టంచేశారు. రాష్ట్రంలోని మొత్తం 13 లోక్ సభ సీట్లను గెల్చుకుంటామని చెప్పారు. ‘‘40 మంది అభ్యర్థుల జాబితా సిద్ధం చేశాం. గెలుపు గుర్రాలనే పోటీకి దించుతాం. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, గోవా, గుజరాత్​లలో సీట్ల పంపకం​పై కాంగ్రెస్​తో ఒప్పందం కుదరలేదు. నియోజకవర్గాల్లో సర్వే చేసి అభ్యర్థులను ప్రకటిస్తాం” అని చెప్పారు.

దీదీ తలకు గాయం

సీఎం మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె తలకు గాయాలైనట్టు అధికారులు తెలిపారు. ఎదురుగా వచ్చిన వెహికల్​ను తప్పించబోయి డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించేందుకు బుధవారం మధ్యాహ్నం ఆమె ఈస్ట్ బర్ధమాన్‌‌‌‌‌‌‌‌‌‌ వెళ్లారు. హెలికాప్టర్​లో కోల్​కతాకు చేరుకోవాల్సి ఉండగా.. వర్షాలు పడటంతో రోడ్డు మార్గం గుండా బయలుదేరారు. కాన్వాయ్​కు ఒక్కసారిగా మరోకారు అడ్డువచ్చింది. దీంతో డ్రైవర్ సడెన్​ బ్రేక్ వేశాడు. ముందు సీట్లో కూర్చున్న మమతా బెనర్జీ.. విండ్‌‌‌‌షీల్డ్‌‌‌‌కు ఢీకొనడంతో తలకు గాయమైనట్టు అధికారులు తెలిపారు.