అమిత్ షా రాజీనామా చేయాల్సిందే

అమిత్ షా రాజీనామా చేయాల్సిందే



కోల్ కతా: బెంగాల్, కూచ్ బెహర్ లోని సితల్ కుచ్చిలో ఎన్నికల పోలింగ్ లో భాగంగా భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు పౌరులు చనిపోవడంపై సీఎం మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు. ఓట్లు వేయడానికి వచ్చిన సామాన్యుల మీద కాల్పులు జరపడం ఏంటని ఫైర్ అయ్యారు. ఈ ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాదే బాధ్యత అని.. ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. 

ఓటింగ్‌కు అంతరాయం కలిగించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలను సాధారణ ప్రజానీకం అడ్డుకోవడంతోనే ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. బీజేపీ గూండాలకు కేంద్ర బలగాల ప్రోద్బలం ఉందని, హోం మంత్రి సారథ్యంలోనే ఈ కుట్ర జరిగిందన్నారు. నలుగురు పౌరుల పాశవిక మృతికి నిరసనగా ఆదివారం నల్ల బ్యాడ్జీలతో శాంతియుత ఆందోళన చేస్తామన్నారు. ఈ సమయంలో ప్రజలు సంయమనంతో ఉండాలని, బీజేపీని ఓడించడం ద్వారా తమ ఆగ్రహాన్ని చూయించాలని పిలుపునిచ్చారు.