అద్దె కార్లు అమ్ముకుని జల్సాలు

అద్దె కార్లు అమ్ముకుని జల్సాలు

జ్యోతినగర్, వెలుగు: కార్లు అద్దెకు తీసుకుని వాటిని అమ్ముకుని వచ్చిన పైసలతో జల్సాలు చేస్తున్న వ్యక్తిని పెద్దపల్లి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ పి.రవీందర్ వివరాల ప్రకారం.. ఎన్టీపీసీ ఏరియాకు చెందిన గొర్రె రాజు జీవీఆర్ కన్ స్ట్రక్షన్ కంపెనీ కోసమని చెప్పి ఎన్టీపీసీ, మంచిర్యాల, పెద్దపల్లి ప్రాంతాల్లోని పలువురి కార్లను అద్దెకు తీసుకునేవాడు. ఒక్కో దానికి నెలకు రూ.30 వేలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకునేవాడు. మొదటి 2, 3 నెలలు సక్రమంగా అద్దె చెల్లించి ఆ తర్వాత కార్లను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మేసేవాడు. అలా14 అద్దె కార్లను అమ్ముకుని వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు.

ఆ తర్వాత కార్ల యజమానులకు దొరకకుండా ఎప్పటికప్పుడు ఫోన్​నంబర్లు మార్చుతున్నాడు. అలాగే అడ్రస్​లు మార్చుతూ 3 ఆధార్ కార్డులు తయారుచేసుకుని తిరుగుతున్నాడు. బాధితుల్లో ఒకరైన శ్రీపెల్లి వంశీకృష్ణ ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించి గొర్రె రాజుపై కంప్లైంట్​ చేశాడు. గురువారం తెల్లవారుజామున రామగుండం బి‒పవర్ హౌస్ గడ్డ వద్ద తనిఖీలు చేస్తుండగా కారులో హైదరాబాద్ వెళ్తూ రాజు పోలీసులకు చిక్కాడు. అతని నుంచి రూ.1.50 కోట్ల విలువైన 14 కార్లను, 3 ఆధార్ కార్డులు, ఏటీఎం కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కార్లు అమ్మగా వచ్చిన రూ.45 లక్షలను జల్సాలకు ఖర్చు చేశానని రాజు ఒప్పుకున్నాడు.