
- వ్యక్తి హత్యకు దారితీసిన కుల సంఘం ఎన్నికలు
- సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలకలం రేపిన ఘటన
సూర్యాపేట, వెలుగు: ఓ కులానికి సంబంధించిన వాట్సప్ గ్రూప్ లో ఎమోజి పెట్టినందుకు వ్యక్తిని కొట్టిచంపిన ఘట న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికంగా కలకలం రేపిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆగస్టు 3న సూర్యాపేట పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా శ్రీరాముల రాములు(56) పోటీ చేస్తున్నారు. కొంతకాలంగా ప్రస్తుత అధ్యక్షుడు అప్పం శ్రీనివాస్‌కు, రాములుకు మధ్య విభేదాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలో తమ కుల సంఘం వాట్సాప్ గ్రూప్ లో శ్రీనివాస్‌ను లక్ష్యంగా చేసుకుని రాములు మెసేజ్‌లు పెడుతున్నాడు. సోమవారం రాములు పెట్టిన ఒక మెసేజ్‌కు శ్రీనివాస్ రిప్లై మెసేజ్ చేశాడు. ఇతని పోస్టుకు మద్దతుగా సంఘం సభ్యుడు మానుపూరి కృపాకర్ చప్పట్లు కొట్టే ఎమోజిని పెట్టాడు. ఇది కాస్త శ్రీరాముల రాములు, కృపాకర్ మధ్య వివాదానికి దారితీసింది. దీనిపై తమ కుల పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు కృపాకర్ మంగళవారం సూర్యాపేట టౌన్ లోని పద్మశాలి సంఘ భవనానికి వెళ్లాడు.
అప్పటికే అక్కడే ఉన్న శ్రీరాముల రాములు, అతని కొడుకుతో పాటు ఫ్రెండ్స్ కలిసి కృపాకర్ పై దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన కృపాకర్ స్పాట్ లో చనిపోయినట్టు బంధువులు తెలిపారు. సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకుని శిక్షించాలని కృపాకర్ కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు డిమాండ్ చేశారు.