
వందేళ్లు కలిసి నడుస్తానని మాటిచ్చిన భార్య అర్ధంతరంగా తనువు చాలించింది. భర్త, ముగ్గురు పిల్లలకు కన్నీరు మిగిల్చి కన్ను మూసింది. కష్టసుఖాల్లో తోడున్న మనిషి చనిపోవడంతో వేదనలో మునిగిపోయాడతడు. కానీ అంతలోనే ఆందోళన. అంత్యక్రియలు ఎలా? కళ్ల నిండా నీళ్లు. కనీసం కాటికి తీసుకెళ్లేందుకు పైసలు లేని నిస్సహాయ స్థితి. ఆమె మృతదేహం పక్కనే గంటల తరబడి పడిగాపులు కాశాడు. చివరికి అడుక్కుని డబ్బు పోగు చేసి ఆమెను కాటికి సాగనంపాడు. కన్నీరు తెప్పించే ఈ ఘటన జగిత్యాలలో శనివారం జరిగింది.
రెండు నెలల క్రితం మస్తాన్, ముంతాజ్ దంపతులు పొట్టకూటి కోసం మహబూబ్ నగర్ నుంచి జగిత్యాల జిల్లా కేంద్రానికి వలస వచ్చారు. పార్క్ దగ్గర టౌన్ హల్ సమీపంలో తల దాచుకుంటూ కూలి పని చేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ముంతాజ్ కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స చేయించే స్థోమత లేక.. అలానే నెట్టుకొస్తున్నారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించి శనివారం మృతి చెందింది. దీంతో డబ్బుల కోసం శవాన్ని అక్కడే వదిలి సమీపంలోని షాపుల దగ్గరకు మస్తాన్ వెళ్లాడు. కొడుకుతో కలిసి మస్తాన్ ఒకవైపు భిక్షాటనకు వెళ్లగా, మరోవైపుకు ఇద్దరు కూతుర్లు వెళ్లారు. కొందరు సహాయం అందించారు. భిక్షాటనకు వెళ్లిన ఇద్దరు ఆడపిల్లలు చాలాసేపటి వరకు తిరిగిరాకపోవడంతో వారు రాకుండానే
అంత్యక్రియలు పూర్తి చేశారు.