చదివింది ఇంటర్.. క్యాటరింగ్ సర్వీస్ పేరిట కచ్రా పని..కాంటాక్ట్స్ హ్యాక్ చేసి... ఫోటోలు మార్ఫ్ చేసి..

చదివింది ఇంటర్.. క్యాటరింగ్ సర్వీస్ పేరిట కచ్రా పని..కాంటాక్ట్స్ హ్యాక్ చేసి... ఫోటోలు మార్ఫ్ చేసి..
  • ముందే డబ్బులు తీసుకుని అ‘ధనం’ కోసం డిమాండ్​
  • ఇవ్వకపోతే ఫోన్ కాంటాక్ట్స్​హ్యాక్ 
  • ఇన్​స్టా, ఫేస్​బుక్​లో ఫొటోల మార్ఫింగ్​
  • బంధువులకు పంపి బ్లాక్​మెయిల్​ 
  • నగరంలో ఎందరో బాధితులు
  • అరెస్ట్​ చేసిన మార్కెట్ ​పోలీసులు

పద్మారావు నగర్, వెలుగు : అతడు చదివింది ఇంటర్. క్యాటరింగ్​ కార్మికులను సరఫరా చేసే పని చేస్తుంటాడు. కానీ, చేసిన పనికి మాట్లాడుకున్న డబ్బు తీసుకుని ఆగిపోడు. ఏదో తప్పు చూపి అదనంగా డబ్బులు కావాలని డిమాండ్​చేస్తాడు. ఇవ్వకపోతే అతడి ఫోన్​హ్యాక్​చేస్తడు. కాంటాక్ట్స్​తీసుకుని ముందు సోషల్​మీడియాలో వల్గర్​మెసేజ్​లు పెట్టి వేధిస్తడు. 

అయినా వినకపోతే ఇన్​స్టా, ఫేస్​బుక్​లో బాధితుల భార్య, పిల్లల ఫొటోలు తీస్కుంటడు. వాటిని మార్ఫింగ్​చేసి కాంటాక్ట్​లిస్టులో ఉన్న అందరికీ పంపిస్తానని బ్లాక్​మెయిల్​చేస్తడు. దీంతో నూటికి 99 మంది డబ్బులు ఇచ్చేవారు. దీంతో ఇదే పనిగా పెట్టుకుని చివరకు సికింద్రాబాద్​మార్కెట్​పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. 

ఇంటర్​ చదివినా హ్యాకింగ్ ​పై పట్టు 

సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్​ఇన్ స్పెక్టర్​ వి.రామచంద్రం కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా‌‌కు చెందిన ముదిరాజ్ వన్నూరు స్వామి అలియాస్ అంజి కిరణ్ అలియాస్ అభి (34) ఇంటర్​చదివాడు. ఉపాధి కోసం కొంతకాలం కింద నగరానికి వచ్చి యూసుఫ్‌‌గూడ రహ్మత్​నగర్​లో ఉంటూ క్యాటరింగ్ కార్మికులను సరఫరా చేసే బిజినెస్​చేస్తున్నాడు. ఇతడికి కంప్యూటర్​పై అవగాహన ఉంది..ఈ క్రమంలో హ్యాకింగ్​పై పట్టు సంపాదించాడు. 

ఈ మధ్య సికింద్రాబాద్‌‌కు చెందిన ఓ వ్యక్తి జస్ట్‌‌ డయల్ ద్వారా క్యాటరింగ్ కార్మికులను బుక్ చేసుకున్నాడు. దీంతో ముందు మాట్లాడుకున్న మొత్తం కాకుండా ఎక్కువ ఇవ్వాలని అభి డిమాండ్​చేశాడు. ఇవ్వకపోవడంతో తన విశ్వరూపాన్ని చూపించాడు. బాధితుడి ఫోన్​హ్యాక్​చేసి బంధువుల కాంటాక్ట్స్​సేకరించాడు. బాధితుడికి, అతడి కుటుంబసభ్యులకు అసభ్యకర మెసేజ్​లు పంపాడు. 

వినకపోవడంతో సోషల్​మీడియా అకౌంట్లు హ్యాక్​చేసి ఫొటోలు అసభ్యంగా మార్ఫింగ్​చేశాడు. వాటిని సోషల్​మీడియాలో పెడతానని బెదిరించాడు. కొంతమంది బంధువులకు కూడా పంపడంతో భయపడి కొంత డబ్బు చెల్లించాడు. అయినా వేధింపులు ఆపకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​చేశారు.