ఆన్ లైన్ మోసం పెళ్లి చేసుకుంటానని యువతి నుంచి రూ. 40 లక్షలు కొట్టేసిన కేటుగాడు

ఆన్ లైన్ మోసం పెళ్లి చేసుకుంటానని యువతి నుంచి రూ. 40 లక్షలు కొట్టేసిన కేటుగాడు

ఆన్ లైన్ పెళ్లి చూపుల్లో జరిగే మోసాల గురించి రోజు వింటున్నాం.. అయినా రోజుకో చోట ఎవరో ఒకరు ఆ ట్రాప్ లో పడిపోతూనే ఉన్నారు. ఆన్ లైన్ లో పెళ్లి చూపులు జరగడం.. అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్ట పడటం పేరెంట్స్ ఒప్పుకోవడం పెళ్లి చేయడం.. కట్ చేస్తే అబ్బాయి పెద్ద ఫ్రాడ్..డబ్బుతో ఉడాయించడం ఇలాంటి సంఘటనలు దేశ వ్యాప్తంగా ఎన్నో చూస్తున్నాం.. అయినా సరే అలెర్ట్ గా ఉండి చెడు ఏదో మంచేదో తెలుసుకోకుండా అబ్యాయి మంచిగుంటే చాలు.. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తే చాలు అనుకుంటూ రోజుకొకరు ఈ ట్రాప్ లో పడుతున్నారు.  

మహారాష్ట్రలోని పూణేలో నివాసం ఉంటున్న ఓ కేటుగాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటూ ఓ యువతిని మోసం చేశాడు. రూ. 40.5 లక్షలతో ఉడాయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూణేకు చెందిన 33 ఏళ్ల యువతి షాదీ డాట్ కామ్ అనే వెబ్ సైట్ లో పెళ్లి చేసుకోవడం కోసం వరుడు కావాలని రిజిస్ట్రేషన్ చేసుకుంది. అక్కడ ఆమెకు రాజేష్ శర్మ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. 

తాను విదేశాల్లో ఉన్నానని శర్మ యువతికి చెప్పాడు. తర్వాత పరిచయం పెంచుకున్న శర్మ, యువతి వీడియో కాల్స్‌ ద్వారా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు శర్మ తాను ఇండియా వచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఇల్లు కూడా కొనుక్కుని వ్యాపారం చేయాలనుకుంటున్నానని చెప్పాడు. యువతిని నమ్మించేందుకే ప్రయాణానికి సంబంధించిన విమాన టిక్కెట్లు కొన్నానని చెప్పాడు.

 ఆ తర్వాత ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నానని, మానిటరింగ్ ఫండ్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కరెన్సీ మార్పిడికి డబ్బులు కావాలని చెప్పాడు. అతని మాటలు నమ్మిన యువతి 40.5 లక్షల రూపాయలు పంపింది. అయితే కొద్ది రోజులకే తాను మోసపోయానని యువతి గ్రహించింది. దీంతో ఆమె ముంద్వా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నామని  పోలీసులు తెలిపారు.