డబ్బుల వర్షం కురిపిస్తానంటూ వ్యాపారికి టోపీ

డబ్బుల వర్షం కురిపిస్తానంటూ వ్యాపారికి టోపీ

డబ్బుల వర్షం కురిపిస్తానంటే ఎవరైనా నమ్ముతారా..? పిల్లలు కూడా నమ్మే అవకాశం లేదు.  టెక్నాలజీ వల్ల ఇప్పటి పిల్లలు చాలా అప్డేట్ అవుతున్నారు.. మ్యాజిక్కులు బోలెడు చూసేశాం అంటారు. అయితే ఓ బడా వ్యాపారి మాత్రం దీన్ని అమాయకంగా నిజమనుకుని నమ్మాడు. నమ్మడం వరకు అయితే ఫర్వాలేదు కాని.. ఆ మంత్రమేదో తనకు నేర్పించమంటూ ఆ మాటలు చెప్పిన వ్యక్తిని గురూజీగా పిలుస్తూ దక్షిణ (ఫీజు) కింద 52 లక్షలు సమర్పించుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా.. రోజులు.. వారాలు.. నెలలు గడచినా తన దగ్గర తీసుకున్న డబ్బు తిరిగివ్వకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించిన ఘటన మహారాష్ట్రలోని పుణే పట్టణంలో చోటు చేసుకుంది. 
విచిత్రమైన ఈ ఘటన పోలీసుల కథనం ప్రకారం కిసాన్ పవార్ (45) అనే వ్యక్తి తాను మంత్రికుడినంటూ 2016లో  ఓ వ్యాపారవేత్తను పరిచయం చేసుకన్నాడు.  చిన్న చిన్న మ్యాజిక్కులు చేసి నమ్మేలా చేసుకున్నాడు. తనకు అతీంద్రీయ శక్తులున్నాయని.. ఏమి కోరుకుంటే దాన్ని నెరవేర్చుకోవచ్చని ఆశలు రేపాడు. కష్టాలన్నీ తొలగిపోయేలా చేస్తానంటూ వీలున్నప్పుడల్లా డబ్బులు పిండుకున్నాడు. డబ్బుల వర్షం కురిపించే మంత్రం కూడా తెలుసునని.. అవి కావాలంటే నేర్పిస్తానంటే వ్యాపారి నమ్మి దశల వారీగా 52 లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. 
ఇంత డబ్బు తీసుకున్నా ఒక్క మంత్ర విద్య కూడా నేర్పించకపోవడంతో వ్యాపారి తనను మోసం చేస్తున్నాడని అనుమానించి గట్టిగా నిలదీశాడు. డబ్బుల వర్షం కురిపించాలంటే నరబలి ఇవ్వాల్సి ఉంటుందని కిసాన్ పవార్ చెప్పాడు. దీంతో షాక్ తిన్న వ్యాపారి వెంటనే పుణె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు స్టేషన్ కు వచ్చి వ్యాపారి చెబుతున్న మాటలు విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. మాంత్రికుడినని చెప్పుకున్న కిసాన్ పవార్ అనే మోసగాడు అబ్రకదబ్ర.. దబ్రకఅబ్ర.. అంటూ గారడీలు చేసే టైపు వ్యక్తని తేల్చారు. టెక్నాలజీ ఇంతగా పెరిగిపోతున్నఈ రోజుల్లో కూడా ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పుణె ఏసీపీ సురేంద్రనాధ్ దేవ్ ముఖ్ హెచ్చరించారు.