పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం
  •  ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన యువతి
  • యువకుడిని అరెస్టు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు

రాజేంద్రనగర్, వెలుగు:  పెళ్లి పేరుతో యువకుడు-..ఓ అమ్మాయిని మోసం చేయగా..ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో  పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. సర్కిల్ ఇన్ స్పెక్టర్ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం..ముంబయికి చెందిన ఓ యువతి(28)..ఫిల్మ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడానికి నెల రోజుల క్రితం సిటీకి వచ్చింది. ఆ యువతి షాదీడాట్ కామ్ లో పెళ్లి కోసం తన ప్రొఫైల్లో ఫొటో అప్ లోడ్ చేసింది. వనస్థలిపురానికి చెందిన సాయినాథ్(30) షాదీడాట్ కామ్ లో ఆ అమ్మాయి ఫొటో చూసి నచ్చడంతో ఆమెకు కాల్ చేశాడు. దీంతో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. రాజేంద్రనగర్ సర్కిల్ లోని అత్తాపూర్ లో ఉంటూ అసిస్టెంట్ డైరెక్టర్ గా అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆ యువతిని సాయినాథ్ కలిశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపు 15 రోజులపాటు ఆమెతో సహజీవనం చేశాడు. ఆ తర్వాత సాయినాథ్..యువతిని  పెళ్లి చేసుకోనని చెప్పా డు.దీంతో మనస్థాపానికి గురైన ఆ యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన స్థానికులు ఆమెను అత్తాపూర్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించి..పోలీసులకు సమాచారం ఇచ్చారు.  హాస్పిటల్ లో ఆ యువతి ట్రీట్ మెంట్ పూర్తయిన తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకుని సాయినాథ్ పై కేసు నమోదు చేశారు. సాయినాథ్ ను అరెస్టు చేసి మంగళవారం కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ సురేశ్ తెలిపారు.