పెండ్లి పేరిటరూ.1.80 కోట్లు వసూలు

పెండ్లి పేరిటరూ.1.80 కోట్లు వసూలు

గచ్చిబౌలి, వెలుగు: పెండ్లి చేసుకుంటానని వితంతు మహిళను నమ్మించి రూ.1.80 కోట్లు వసూలు చేసిన ఓ వ్యక్తిని సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. కొండాపూర్​ వెంకటాద్రి రెసిడెన్సీలో నివసించే ఓ మహిళ(35) భర్త 2008లో చనిపోయాడు. తల్లిదండ్రుల సూచన మేరకు ఆమె మరో పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. మ్యాట్రిమోనీ యాప్ లో తన వివరాలను అప్ లోడ్​ చేసింది. ఆ యాప్​ ద్వారా  ఆమెకు కృష్ణ వంశీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను యూఎస్​ రెసిడెంట్​అని, గూగుల్​లో ఉద్యోగం చేస్తున్నానని నమ్మబలికాడు.  యూఎస్​ నెంబర్ల నుంచి ఫోన్​ చేసి మహిళ కుటుంబ సభ్యులతో  పెండ్లి విషయాలను చర్చించాడు. కొద్ది రోజులకు తన బ్యాంక్​ అకౌంట్లు బ్లాక్​అయ్యాయని..అన్​ఫ్రీజ్​ చేయడానికి డబ్బులు అవసరమని మహిళకు చెప్పాడు. కృష్ణవంశీ మాటలను నమ్మిన మహిళ.. తన హెచ్​డీఎఫ్​సీ, కొటాక్​ మహీంద్రా, రెండు ఐసీఐసీఐ బ్యాంక్​ అకౌంట్లకు చెందిన డెబిట్​కార్డులతో పాటు తన వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను అతనికి ఇచ్చేసింది.

వాటిని తీసుకున్న తర్వాత మహిళకు కృష్ణవంశీ నుంచి కాల్స్​రావడం ఆగిపోయాయి. దాంతో తాను మోసపోయానని గ్రహించిన మహిళ మార్చి 28న సైబర్​ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించింది. కృష్ణవంశీ తనను పెండ్లి పేరిట రూ. 1.80 కోట్లు చీటింగ్​చేశాడని ఫిర్యాదులో తెలిపింది.  దీనిపై దర్యాప్తు చేపట్టిన సైబర్​ క్రైమ్​ పోలీసులు..నిందితుడు ఏపీలోని చిత్తూరు జిల్లా పాకాల మండలం వలపాలవారి పల్లి గ్రామానికి చెందిన కె. వంశీ చౌదరి(38)గా గుర్తించారు. అతడి వద్ద నుంచి రెండు స్మార్ట్​ఫోన్లు, కస్టమ్స్​కు చెందిన రబ్బర్​ స్టాంపులు, గూగుల్​ కంపెనీ ఐటీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. వంశీ చౌదరిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.