పెళ్లి ఇష్టం లేక వరుడి హై డ్రామా

పెళ్లి ఇష్టం లేక  వరుడి హై డ్రామా

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. పెళ్లి ఇష్టం లేక వరుడు హై డ్రామా క్రియేట్ చేశాడు. దీంతో వధువు బంధువులు అతడికి దేహశుద్ధి చేశారు. రూ. 25 లక్షల కట్నం, ఇతరత్రా లాంచనాలు ఇచ్చినా పెళ్లి చేసుకొనేందుకు వరుడు నిరాకరించాడు. హన్మకొండకు చెందిన ఎన్ఆర్ఐ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అన్వేష్ తో జగిత్యాలకు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. రూ. 25 లక్షల కట్నంతో ఇతర కానుకలు ఇచ్చి పెళ్లి చేసేందుకు వధువు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఆదివారం వీరి వివాహం జరగాల్సి ఉంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

పెళ్లి మండపానికి చేరుకున్న తర్వాత బాత్ రూంలో కాలు జారి పడ్డానని చెప్పి ఆస్పత్రిలో అన్వేష్ చేరాడు. జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి కాలికి రెడ్ బ్యాండ్ వేయించుకున్నాడు. తనకు ఆరోగ్యం బాగా లేదంటూ మరో ఆస్పత్రిలో చేరాడు. టెస్ట్ లు, స్కానింగ్ లు చేసి ఏలాంటి ఆనారోగ్య సమస్య లేదని డాక్టర్లు చెప్పడంతో వధువు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు గంటల పాటు అనారోగ్యం పేరుతో పెళ్లి కొడుకు హైడ్రామా ఆడాడు. చివరకు పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు నిలదీయడంతో తనకు పెళ్లి ఇష్టం లేదని అన్వేష్ తేల్చిచెప్పాడు. దీంతో పెళ్లి కొడుకును చితకబాదారు. మిగతా విషయాలు పంచాయితీలో తేల్చుకుందామన్నారు.