చనిపోయాడన్న డాక్టర్లు: సమాధి చేస్తుండగా ప్రాణంతో ఉన్నాడు

చనిపోయాడన్న డాక్టర్లు: సమాధి చేస్తుండగా ప్రాణంతో ఉన్నాడు

చనిపోయాడనుకున్న వ్యక్తిని పాతిపెడుతుండగా  చలనం వచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో లో జరిగింది. 20 ఏండ్ల మహమ్మద్ ఫుక్రాన్ కు జూన్ 21న ఆక్సిడెంట్ జరిగింది. దీంతో లక్నో లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు అతని కుటుంబసభ్యులు. ప్రమాదంలో మహమ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే పది రోజుల నుంచి అక్కడి డాక్టర్లు వైద్యం చేస్తున్నారు.  సోమవారం పొద్దున మహమ్మద్ చనిపోయాడని  అతని ఫ్యామిలీ మెంబర్స్ కు తెలిపారు డాక్టర్లు.

దీంతో మహమ్మద్ అంతిమ సంస్కారానికి అతని ఫ్యామిలీ వాళ్లు ఏర్పాట్లు చేశారు. స్మశానంలో మహమ్మద్ ను పూడ్చడానికి సిద్దమవగా అతను కదిలినట్లుగా అక్కడే ఉన్న ఒకతను గమనించాడు.  మిగితావారికి చెప్పడంతో మహమ్మద్ ను రామ్ మనోహర్ లోహిత్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు మహమ్మద్ ను పరిశీలించి అతను ఇంకా చనిపోలేదని, బ్రేన్ డెడ్ కాలేదని చెప్పారు. అయితే మహమ్మద్ పరిస్థితి విషమంగా ఉందని చికిత్సను మొదలు పెట్టారు.

ఈ విషయంపై మహమ్మద్ అన్న మీడియాతో మాట్లాడాడు. తమ దగ్గర మనీ అయిపోయాయని డాక్టర్లకు చెప్పడంతో తెల్లవారే మహమ్మద్ చనిపోయాడని చెప్పినట్టు తెలిపాడు. అప్పటికే తాము 7లక్షల రూపాయలను ఆ హాస్పిటల్ కు చెల్లించినట్లు చెప్పాడు. సదరు హాస్పిటల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ ఘటనపై లక్నో చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్పందించి విచారణ జరుపుతామని తెలిపారు.