
- తమ వాడు కాదని చివరి నిమిషంలో గుర్తించిన కుటుంబసభ్యులు
- ఎంజీఎంలోనే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న అసలు వ్యక్తి
- పచ్చబొట్టు, వాచీ ఆధారంగా గుర్తించిన కుటుంబసభ్యులు
వరంగల్/వరంగల్ సిటీ/రాయపర్తి, వెలుగు : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో డెడ్‌బాడీ మారిన ఘటనలో అసలు వ్యక్తి కుమారస్వామి బతికే ఉన్నట్లు తేలింది. యాక్సిడెంట్‌లో గాయపడిన అతడు ప్రస్తుతం ఎంజీఎంలోనే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. ఎంజీఎం హాస్పిటల్ ఔట్ పోస్ట్ పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగినట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే... మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉంటూ కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు.
ఎప్పుడో ఒకసారి మాత్రమే పిల్లల వద్దకు వచ్చేవాడు. ఈ క్రమంలో 9వ తేదీన జరిగిన యాక్సిడెంట్‌లో కుమారస్వామి గాయపడడంతో తొర్రూరు పోలీసులు ఎంజీఎంకు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయాడంటూ.. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఎంజీఎం మార్చురీ నుంచి డెడ్‌బాడీని తీసుకెళ్లారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా చివరి నిమిషంలో అది కుమారస్వామి డెడ్‌బాడీ కాదని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు శుక్రవారం రాత్రి బాడీని తిరిగి ఎంజీఎం మార్చురీకి తరలించారు.
తర్వాత కుమారస్వామి డెడ్‌బాడీ కోసం వెతకగా మార్చురీలో కనిపించలేదు. శనివారం ఉదయం హాస్పిటల్‌కు వచ్చిన తొర్రూర్ పోలీసులు.. 9న గాయపడ్డ వ్యక్తిని అడ్మిట్ చేసిన ఆర్థోపెడిక్ వార్డుకు వెళ్లి పరిశీలించగా అతడు అక్కడే ఉన్నాడు. దీంతో వారు కుమారస్వామి భార్య, పిల్లలను పిలిచి చూపించగా... చేతిపై ఉన్న ‘శ్రీ’ అనే పచ్చబొట్టుతో పాటు వాచీ ఆధారంగా అతడే కుమారస్వామి అని కూతురు స్వప్న గుర్తించింది. ఈ మొత్తం ఘటన ఎంజీఎం ఔట్‌పోస్ట్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరిగినట్లు తేలింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎంజీఎం సూపరింటెండెంట్ కిశోర్‌కుమార్
తెలిపారు.