
- ఇంటిముందు డెడ్ బాడీతో బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన
చేర్యాల, వెలుగు: వ్యవసాయ భూమిని లాక్కోవడంతోనే గుండెపోటుతో చనిపోయాడని ఆరోపిస్తూ.. డెడ్ బాడీతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన మేరకు..
చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన పోలోజు చంద్రం(45) కు అదే గ్రామానికి చెందిన కత్తుల భాస్కర్‌రెడ్డి కొంత నగదు అప్పుగా ఇచ్చి.. దానికి బదులుగా ఒక ఎకరం భూమిని బలవంతంగా రిజిస్ర్టేషన్చేయించుకున్నాడు. అప్పు తిరిగి చెల్లిస్తామని, ఆ భూమిని తమకు రిజిస్ర్టేషన్చేసి ఇవ్వాలని చంద్రం ఎన్నోసార్లు కోరినా భాస్కర్ రెడ్డి పట్టించుకోలేదు. పంచాయితీ పెట్టి అప్పుకు మిత్తి కూడా ఇస్తామని తెలిపినా వినడంలేదు. దీంతో మనస్తాపంతో బుధవారం చంద్రంకు ఒక్కసారిగా బీపీ పెరగడంతో గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చనిపోయాడు.
గురువారం భాస్కర్ రెడ్డి ఇంటి వద్ద డెడ్ బాడీతో బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. తమ భూమిని తిరిగి రిజిస్ర్టేషన్చేసి ఇవ్వాలని కోరింది. గ్రామస్తులు మద్దతు తెలిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
చేర్యాల సీఐ ఎల్. శ్రీను, ఎస్ఐ నవీన్ వెళ్లి నచ్చజెప్పినా వినకపోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భాస్కర్‌రెడ్డి కుటుంబసభ్యులతో పోలీసులు, గ్రామస్తులు చర్చించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.