జూబ్లీహిల్స్, వెలుగు: డెంటల్ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీరామ్ గోపి తెలిపిన వివరాల మేరకు.. కూకట్‌పల్లికి చెందిన లక్ష్మీనారాయణ (30) అనే వ్యక్తి ఈ నెల16న జూబ్లీహిల్స్‌రోడ్ నెంబరు 36లోని ఎఫ్.ఎమ్.ఎస్అనే డెంటల్ ఆసుపత్రిలో చికిత్సకు వెళ్లాడు.
చికిత్స ప్రారంభానికి ముందు వైద్యులు అతనికి మత్తుమందు ఇచ్చారు. లక్ష్మీ నారాయణ వాష్‌రూమ్‌కు వెళ్లి వచ్చే సమయంలో సడన్‌గా కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని అంబులెన్స్‌లో అపోలో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. లక్ష్మీనారాయణ మృతిపై తండ్రి రాములు 17న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అధిక మొత్తంలో మత్తుమందు ఇవ్వడం వల్లే తన కుమారుడు చనిపోయాడని రాములు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
