ORRపై 200 కిలోమీటర్ల స్పీడ్‌తో కారు డ్రైవింగ్.. తేడా వస్తే పీస్ పీస్ కదా..!

ORRపై 200 కిలోమీటర్ల స్పీడ్‌తో కారు డ్రైవింగ్.. తేడా వస్తే పీస్ పీస్ కదా..!

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై స్పీడ్ లిమిట్ 120 కిలోమీటర్లు మాత్రమే.. అంతకు మించితే ఫైన్.. 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లటమే డేంజర్ గా ఉంది కొన్నిసార్లు.. ఆ స్పీడ్ లోనే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇన్ని చూస్తున్నా.. ఇంత తెలిసినా కొందరు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అదేదో ఘనకార్యం అన్నట్లు అందరికీ చెబుతున్నారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై స్పీడ్ టెస్ట్ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆ కారు స్పీడ్ ఎంతో తెలుసా.. అక్షరాల 200 కిలోమీటర్లు.. అవును.. 204 కిలోమీటర్ల స్పీడ్ టచ్ అయ్యింది. యశ్వంత్ రెడ్డి అనే ఓ వ్యక్తి.. కొత్త కారు కొన్నాడు. ఆ కారు స్పీడ్ ఎలా ఉంది అని టెస్ట్ చేయటం కోసం అన్నట్లు.. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాడు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు, భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. 200 కిలోమీటర్ల స్పీడ్ లో అనుకోకుండా ఏదైనా జరిగి ఉంటే.. ముందూ వెనకా వెళుతున్న వాహనదారుల పరిస్థితి ఏంటీ.. ఇతని ఘనకార్యం వల్ల వాళ్లు నష్టపోవాలా.. వాళ్లు ప్రాణాలు కోల్పోవాలా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ వీడియోను సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు.. కారు డ్రైవ్ చేసిన యశ్వంత్ రెడ్డి అనే వ్యక్తికి నోటీసులు ఇచ్చారు. కారును సీజ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకున్నామంటూ ప్రకటించారు. నార్సింగ్ టోల్ ప్లాజా నుంచి అప్పా జంక్షన్ వరకు రేసింగ్ డ్రైవ్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. కారు సీజ్ చేయటమే కాకుండా నోటీసులు జారీ చేశామని.. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు పోలీసులు.

ఔటర్ పై ప్రభుత్వం నిర్ణయించిన 120 కిలోమీటర్ల స్పీడ్ లోనే కొన్ని ఘోర ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో.. నిబంధనలకు విరుద్ధంగా.. 200 కిలోమీటర్ల వేగంతో కారు డ్రైవింగ్ చేయటం.. రేసింగ్ పెట్టుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. 153 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం దూరాన్ని గంట 18 నిమిషాల్లో కంప్లీట్ చేయటం అంటే.. అతను కారును ఎంత స్పీడ్ తో.. ఏ రేంజ్ లో డ్రైవ్ చేసి ఉంటాడో కదా..