కుటుంబంలోని 8 మందిని చంపి.. ఉరేసుకుండు

కుటుంబంలోని 8 మందిని చంపి.. ఉరేసుకుండు
  •     ఆపై తానూ ఆత్మహత్య, మధ్యప్రదేశ్​లోని చింద్వారాలో ఘోరం
  •     నిందితుడిని మానసిక రోగిగా గుర్తించిన పోలీసులు

చింద్వారా : మధ్యప్రదేశ్​లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన కుటుంబంలోని 8 మందిని నరికి చంపేశాడు. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. చింద్వారా జిల్లాలోని గిరిజన గ్రామమైన బోదల్ కచర్​కు చెందిన దినేశ్ సరియం అలియాస్ భురా(26) తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులంతా నిద్రలో ఉండగా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మొదట అతని తల్లి సియాబాయి(55), అన్న శ్రవణ్​కుమార్(35), వదిన బారతోబాయి(30), భార్య వర్ష(23)పై గొడ్డలితో దాడి చేశాడు. ఆపై తన 16 ఏండ్ల చెల్లి పార్వతి, మేనల్లుడు కృష్ణ(5), మేనకోడళ్లు సెవుంటి(4), దీప(1)ను నరికి చంపేశాడు. అనంతరం పక్కింట్లో ఉండే ఓ పదేండ్ల చిన్నారిపైనా దాడి చేసేందుకు ప్రయత్నించగా ఆ పాప తప్పించుకుంది. బాధితుల కేకలు విని ఇరుగుపొరుగువారు ఆ చిన్నారి ఇంట్లోకి రాగా వాళ్లను చూసి దినేశ్ పారిపోయాడు. చుట్టుపక్కలవాళ్లంతా అతడి గురించి వెతుకుతుండగా దగ్గర్లోని ఓ చెట్టుకు దినేశ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించారు.

నిందితుడికి ఈ మధ్యే పెండ్లి.. 

సమాచారమివ్వడంతో పోలీసులు స్పాట్​కు చేరుకున్నారు. 8 మంది చనిపోయినట్లు గుర్తించారు. నిందితుడు స్కిజోఫ్రెనియా అనే మానసిక వ్యాధిగ్రస్తుడని, గతంలోనూ ట్రీట్​మెంట్ తీసుకున్నాడని చింద్వారా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ వ్యాధితో ఉన్నవాళ్లు ఇతరులపై దాడి చేయొచ్చని డాక్టర్ల ద్వారా తెలుసుకున్నామన్నారు. అయితే, ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న నిందితుడికి ఈ నెల 21న పెండ్లి కావడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు.