
బ్రెసీలియా (బ్రెజిల్): నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి అమెజాన్ అడవుల్లో వేటకు వెళ్లిన బొలీవియా యువకుడు జోనాథన్ అకోస్టా తప్పిపోయాడు. 31 రోజుల తర్వాత అతడు ఫారెస్ట్ సెర్చింగ్ టీమ్స్ కు దొరికాడు. దాదాపు నెల రోజుల పాటు విషపు పాములు, పులులు, సింహాల నడుమ అడవుల్లో ఏకాకిగా తిరిగి తిరిగి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నెల రోజుల పాటు పురుగులు తింటూ కాలం గడిపాడు. రోజూ వర్షం పడినప్పుడల్లా తన రబ్బర్ షూస్‌లో నీళ్లు పట్టుకొని తాగేవాడు. ఒక్కోసారి వర్షం పడనప్పుడు.. దాహం తీర్చుకునేందుకు తన మూత్రాన్నే తాగేవాడు. అడవుల్లో తిరిగే క్రమంలో చాలాసార్లు పులుల నుంచి కొద్దిలో తప్పించుకున్నానని జోనాథన్ మీడియాకు చెప్పాడు. తాను తీసుకెళ్లిన తుపాకీ సాయంతో అడవి పందుల దాడి నుంచి రక్షణ పొందానని తెలిపాడు. సరైన తిండిలేకపోవడంతో 30 ఏళ్ల జోనాథన్ అకోస్టా బరువు 17 కేజీలు తగ్గిపోయిండు. మంచి నీళ్లు తాగకపోవడంతో తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురయ్యాడు. అడవుల్లో దారి కోసం వెతికి వెతికి.. జంతువుల నుంచి తనను కాపాడుకునేందుకు పరిగెత్తాల్సి రావడంతో జోనాథన్ కాలి చీలమండ విరిగిపోయింది.
జనవరి 25న అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన అతడికి మళ్లీ ఫిబ్రవరి 25న మనుషులు కనిపించారు. తాను ఉన్న ప్లేస్‌కు 300 మీటర్ల దూరంలో జోనాథన్‌కు ఫారెస్ట్ సెర్చింగ్ టీమ్ కనిపించింది. దీంతో అతడికి మళ్లీ బతుకుపై ఆశలు చిగురించాయి. జోనాథన్ కుంటుతూ.. ముళ్ల కంచెలను దాటుకుంటూ.. అరుచుకుంటూ వాళ్ల వైపు పరుగెత్తుకొచ్చాడు. వాళ్లు జోనాథన్ ను కాపాడారు. ‘‘ఇప్పటి నుంచి నేను వేటను వదిలేస్తా. అడవుల్లోని జంతువుల జోలికి వెళ్లను. ఇక నేను నా గిటార్‌ను దేవుడి ప్రార్థన కోసం వినియోగిస్తా” అని ఓ మీడియా చానల్‌కు జోనాథన్ అకోస్టా చెప్పాడు.