ఐబ్రోస్ చేయించుకుందని విడాకులు.. వీడియో కాల్​లోనే ట్రిపుల్ తలాక్

ఐబ్రోస్ చేయించుకుందని విడాకులు.. వీడియో కాల్​లోనే ట్రిపుల్ తలాక్

లక్నో: ఐబ్రోస్  చేయించుకుందని ఓ వ్యక్తి తన భార్యకు వీడియో కాల్ లోనే ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. ఉత్తరప్రదేశ్‌‌లో అక్టోబర్ 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాన్పూర్‌‌కు చెందిన గుల్సాబాకు ప్రయాగ్‌‌రాజ్‌‌కు చెందిన మహ్మద్ సలీమ్‌‌తో కిందటేడాది పెండ్లి జరిగింది. కొద్ది నెలల కిందట ఉపాధికోసం సలీమ్ సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్టోబరు 4న భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ.. ఆమె ఐబ్రోస్ చేయించుకున్నట్లు గుర్తించాడు. తన ఇష్టాన్ని గౌరవించకుండా, తనతో చెప్పకుండా ఎందుకు పార్లర్‌‌కు వెళ్లావని గుల్సాబాను నిలదీశాడు.

కోపంతో అప్పటికప్పుడే ట్రిపుల్ తలాక్ చెప్పి.. ఇక నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చని చెప్పాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త సలీమ్, అత్తమామలు, ఇతర కుటుంబసభ్యులపై వేధింపుల ఆరోపణలు చేసింది. గుల్సాబా ఫిర్యాదు ఆధారంగా ముస్లిం వివాహ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో ట్రిపుల్ తలాక్‌‌ను 2019లో నిషేధించిన కేంద్రం.. ఇందుకోసం చట్టం కూడా తీసుకొచ్చింది. దీని ప్రకారం ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకుంటే మూడేండ్ల జైలు శిక్షతో పాటు ఫైన్​ కూడా విధిస్తారు.