
కూకట్ పల్లి: పెళ్లి చేసుకోవాల్సిన తనతో కాకుండా ఇతరులతో తిరుగుతోందని అనుమానించి తన మరదల్ని ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లి ఏవీబీపురానికి చెందిన భూపతి అనే వ్యక్తి అతడి మరదలు తనతో కాకుండా వేరే అబ్బాయితో సన్నిహితంగా ఉంటోందని తెలిసి ఆమెని నిలదీశాడు. దీనికి ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి భూపతి ఆ అమ్మాయిని తన ఇంటికి పిలిచి గొంతు నులిమి చంపాడు.
మరదలి హత్య గురించి ఎవరికీ అనుమానం కలగకుండా ఆమె ఇంట్లోని నీటి సంపులో శవాన్ని పడివేసి తానూ ఆత్మహత్య చేసుకునే యత్నం చేసాడు. అయితే ధైర్యం చాలకపోవడంతో కూకట్ పల్లి పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతురాలి శవాన్ని బయటికి తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన భూపతి పైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కూకట్ పల్లి సి.ఐ నర్సింగ్ రావు తెలిపారు.