
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు చెల్లిని, పిన తల్లిని రోకలిబండతో కొట్టి చంపేశాడు. సూర్యాపేట మండలం తాళ్లకాంపాడ్లో గురువారం ఈ ఘటన జరిగింది. తాళ్లకాంపాడ్ కు చెందిన రేషన్ డీలర్ కప్పల నాగయ్యకు ఇద్దరు భార్యలు అచ్చమ్మ, అంజమ్మ.. వీరిద్దరూ సొంత అక్కాచెల్లెల్లే. పెద్ద భార్య అచ్చమ్మకు అనారోగ్యం కారణంగా ఆమె చెల్లెలు అంజమ్మను నాగయ్య పెళ్లి చేసుకున్నాడు. పెద్ద భార్య అచ్చమ్మకు ఒక కొడుకు, కూతురు కాగా చిన్న భార్య అంజమ్మకు ఒక కూతురు పుట్టిన పదేళ్ల తర్వాత నాగయ్య చనిపోయాడు. అప్పటి నుంచి అక్కా చెల్లెల్ల కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. నెలకిందటే భూమి పంపకాలపై పంచాయితీ జరిగింది. గురువారం ఉదయం ఇంటి బయట వాకిలి ఊడుస్తున్న పిన్ని అంజమ్మను(45), ఇంట్లో నిద్రలో ఉన్న చెల్లి మౌనిక (22)ను అంజమ్మ కొడుకు హరీశ్ రోకలి బండతో కొట్టడంతో మౌనిక అక్కడికక్కడే చనిపోగా.. కొనఊపిరితో ఉన్న అంజమ్మను దవాఖానకు తరలించారు. ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. సీఏ చదువుతున్న అంజమ్మ కూతురు మౌనిక తెల్లవారితే గుంటూరు వెళ్లాల్సి ఉందని ఇంతలోనే ఆస్తికోసం ఇంత దుర్మార్గానికి పాల్పడుతాడని అనుకోలేదని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. హరీశ్, అచ్చమ్మ, హరీశ్ బావ రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.